×
Ad

Ysrcp: గేట్‌ వే ఆఫ్ ఏపీలో గెలుపే లక్ష్యంగా వైసీపీ పావులు.. కొత్త నేత కోసం ఫ్యాన్ పార్టీ వేట..!

సామాజికవర్గాల వారీగా అన్ని రకాల లెక్కలు పక్కాగా అమలు చేసినా.. వైసీపీకి గత ఎన్నికల్లో కలిసి రాలేదు.

Ysrcp: ఆ ప్రాంతానికి గేట్‌ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పేరు. అలాంటి నియోజకవర్గంలో ఇంచార్జిని మార్చేందుకు వైసీపీ రెడీ అయిందా అంటే.. అవుననే అంటున్నాయ్ సిక్కోలు పొలిటికల్ సర్కిల్స్‌. టోటల్ పార్టీకి ట్రీట్‌మెంట్‌ మొదలు పెట్టిందా.. ఆ సీనియర్‌ నేతను సైడ్ చేయాలని డిసైడ్ అయిపోయిందా.. అదే నిజం అయితే ఆయన స్థానంలోకి వచ్చేది ఎవరు.. కీలక నేత కోసం ఫ్యాన్ పార్టీ సెర్చింగ్‌ మొదలు పెట్టేసిందా.. నెక్ట్స్ ఎన్నికలు టార్గెట్‌గా వైసీపీ వేస్తున్న స్కెచ్ ఏంటి..

ఏపీ రాజకీయాల్లో ఇచ్చాపురం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. గేట్‌ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. ఇది పాదయాత్రలకు పెట్టింది పేరు. ఏ నేత పాదయాత్రలు స్టార్ట్ చేసినా.. ఇక్కడి నుంచే.. ఇక్కడితో షెడ్యూల్‌ చేసుకుంటారు. దీంతో పొలిటికల్ సర్కిల్స్‌లో ఇచ్చాపురం నియోజకవర్గం ఎప్పుడూ హాట్‌టాపిక్‌గానే ఉంటుంది. నిజానికి ఇచ్చాపురంలో వైసీపీకి ఎప్పుడూ ఎదురుదెబ్బలే తగులుతున్నాయ్. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇక్కడ విజయం సాధించలేకపోయింది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా.. అక్కడ ఫ్యాన్‌ పార్టీ జెండా ఎగరడం లేదు. ఐతే వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రికార్డును బ్రేక్ చేయాలని.. ఇచ్చాపురం అడ్డాలో పార్టీ జెండా ఎగురవేయాలని వైసీపీ ఫిక్స్ అయింది. దీనికోసం ఎలాంటి మార్పులకైనా, రిపేర్లకైనా సిద్ధంగా కనిపిస్తోంది.

టీడీపీకి కంచుకోటలా ఇచ్చాపురం నియోజకవర్గం…

ఇచ్చాపురం నుంచి టీడీపీ నుంచి బెందాళం అశోక్ కుమార్‌.. హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి.. ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటలా ఉంది. అంతకుముందు.. కాంగ్రెస్సేతర అభ్యర్ధులే అక్కడ విజయం సాధించారు. ఐతే వైసీపీ ఆవిర్భావం తర్వాత.. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఆ పార్టీకి మారింది. టీడీపీ ఓటు బ్యాంక్ మాత్రం చెక్కు చెదరలేదు. 2014 ఎన్నికల్లో ఇచ్చాపురంలో వైసీపీ తరఫున నర్తు రామారావు బరిలో దిగి ఓడిపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో పిరియా సాయిరాజ్‌ను పోటీకి దింపింది వైసీపీ. ఆయన కూడా 7వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో 2024 ఎన్నికల ముందు.. సాయిరాజ్‌ను సమన్వయకర్తగా తప్పించిన వైసీపీ.. ఆ బాధ్యతలను ఆయన సతీమణి పిరియా విజయకు అప్పజెప్పింది. అయినా వైసీపీకి నిరాశే మిగిలింది. 2024 ఎన్నికల్లో 39వేలకు పైగా ఓట్ల తేడాతో పిరియ విజయ ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని పట్టుదలతో కనిపిస్తున్న వైసీపీ.. కొత్త అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది. దీనికోసం క్షేత్రస్థాయిలో కసరత్తులు కూడా మొదలుపెట్టిందని టాక్.

సమన్వయ లేక వైసీపీకి దెబ్బ మీద దెబ్బ..

సామాజికవర్గాల వారీగా అన్ని రకాల లెక్కలు పక్కాగా అమలు చేసినా.. వైసీపీకి గత ఎన్నికల్లో కలిసి రాలేదు. జనాభాపరంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో రెడ్డిక సామాజికవర్గంతో పాటు.. యాదవ, కాళింగ, అగ్ని కుల క్షత్రియ వర్గాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వైసీపీ హయాంలో యాదవ సామాజికవర్గానికి చెందిన నర్తు రామారావుకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన జగన్.. ఆ వర్గానికి అండగా నిలిచారు. ఇక కాళింగ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ సతీమణి విజయమ్మకి.. బీసీ కోటా జడ్పీ చైర్‌పర్సన్‌గా చాన్స్ అచ్చారు. పైగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇక రెడ్డి సామాజికవర్గానికి చెందిన శ్యామ్ ప్రసాద్ రెడ్డిని.. సిడాప్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. ఇలా అన్ని సామాజికవర్గాలకు జగన్ అవకాశం ఇచ్చినా.. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో.. ఇచ్చాపురంలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.

నేతల మధ్య కోఆర్డినేషన్‌ లేకపోవడమే ఓటమికి కారణం..

వచ్చే ఎన్నికల్లో ఇచ్చాపురంలో విజయం కోసం వైసీపీ పక్కాగా వ్యూహాలు అమలు చేస్తోంది. నేతల మధ్య కోఆర్డినేషన్‌ లేకపోవడమే.. ఓటమికి కారణంగా వైసీపీ అధిష్టానం గుర్తించిందని తెలుస్తోంది. దీంతో ఇంచార్జిని మార్చే ఆలోచనలో ఉందట. పార్టీ వర్గాలు సహకరించడం లేదని పిరియా సాయిరాజు దంపతులు.. వైసీపీ బాస్ దగ్గర మొర పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇచ్చాపురం పార్టీకి ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టిన జగన్‌.. నియోజకవర్గ నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టారని తెలుస్తోంది. కొత్త నేత కోసం వేట మొదలుపెట్టారని టాక్‌. సామాజిక సమీకరణాలుతో పాటు అంగబలం, అర్ధబలం ఉన్న నేతలు కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికే అనేకమంది నేతలు.. అధిష్టానం ముందు తమకి నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వాలని అర్జీలు పెట్టుకుంటున్నారని తెలుస్తోంది. మరి అధినేత ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.

Also Read: అప్పుడు.. ఇప్పుడు.. పవన్ మాటల్లో అదే జోరు..! పరోక్షంగా జగన్‌కు జనసేనాని ఇచ్చే మెసేజ్‌ ఏంటి?