Pawan Kalyan: అప్పుడు.. ఇప్పుడు.. పవన్ మాటల్లో అదే జోరు..! పరోక్షంగా జగన్‌కు జనసేనాని ఇచ్చే మెసేజ్ ఏంటి?
ప్రత్యర్థుల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండే వ్యూహం కూడా ఈ ప్రసంగంలో కనిపిస్తోందన్న చర్చ కొనసాగుతోంది.
Pawan Kalyan: పక్కా.. పరిపూర్ణంగా ! విమర్శలకు కౌంటర్‌లు.. ఎన్‌కౌంటర్‌లు. ఇది పవన్ మాటల్లో కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీ చేసే ప్రతీ విమర్శకు పక్కాగా సమాధానం ఇవ్వడమే కాదు.. కూటమి పార్టీల మధ్య నేతల మధ్య ఐక్యతను ఎప్పటికప్పుడు చాటి చెప్తూనే ఉన్నారు. ఆచీతూచీ.. పక్కాగా లెక్కలేసి మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్న పవన్.. రాజకీయానికి ఇస్తున్న మెసేజ్ ఏంటి.. ఆయన ప్రసంగాలతో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి..
పవన్.. ప్రసంగాలతో రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పుడు డిప్యూటీ సీఎం వరకు.. ప్రసంగం ఏదైనా సరే.. ఎప్పుడైనా సరే.. సూటిగా, సుత్తిలేకుండా.. కౌంటర్‌కు ఎన్‌కౌంటర్ అన్నట్లుగా ఆయన మాటలు వినిపిస్తుంటాయ్. ఇప్పుడు కూడా అలానే వినిపిస్తున్నాయ్. ప్రత్యర్థి పార్టీకి కౌంటర్‌లు ఇవ్వడమే కాదు.. కూటమి పార్టీల ఐక్యతపై జరుగుతున్న ప్రచారానికి తన మార్క్ ఆన్సర్లు ఇస్తున్నారు పవన్. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ మరింత ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కనిపిస్తున్నారా అంటే.. వరుస పరిణామాలు అవును అనేలా అనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. పవన్ ప్రతీ ప్రసంగంలోనూ.. ఆచితూచి మాటలు, స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
కౌంటర్ ఇస్తూ కంట్రోల్ చేసే ప్రయత్నం..!
కొత్తగా ఎంపికైన పోలీసు కానిస్టేబుళ్లకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఐతే అక్కడ ఆయన మాట్లాడిన మాటలు.. రాజకీయంగానే కాదు.. పరిపాలనా పరంగానూ ఆసక్తి రేపుతున్నాయ్. పోలీసు వ్యవస్థను బెదిరించే ధోరణిని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని పవన్ అన్నారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరిపైనా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు అధికారులపై జగన్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ.. అలాంటి ప్రకటనలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తుందని పవన్ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులకు ఎలాంటి సమస్య వచ్చినా కూటమి సర్కార్ అండగా ఉంటుందన్న భరోసా ఇచ్చారు. దీంతో ఇప్పుడు కొత్త చర్చ స్టార్ట్ అయింది. అంటే.. జగన్ ప్రతీ మాటను పవన్ సునిశితంగా పరిశీలిస్తున్నారా.. ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది.
ఒకరికొకరం సహకరించుకుంటున్నామనే సంకేతాలు..
జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడమే కాదు.. పవన్ ప్రసంగాన్ని చూసినప్పుడు కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయ్. సీఎం చంద్రబాబుతో పాటు.. మంత్రి నారా లోకేశ్‌ను కూడా ఈ మధ్య తన ప్రసంగాల్లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు పవన్. ప్రభుత్వానికి అన్ని జిల్లాలు ఒక్కటేనని.. ఐతే ముఖ్యమంత్రికి ఎంత ప్రేమ లేకపోతే సత్యసాయి జిల్లాకు పరిశ్రమలు తెచ్చారు.. ఎంత అభిమానం లేకపోతే ప్రకాశం జిల్లాకు JJM ప్రాజెక్టు ఇచ్చారంటూ చంద్రబాబు తీరును ప్రశంసించారు. అదే సమయంలో మంత్రి లోకేశ్ ప్రస్తావన తీసుకువచ్చారు. పండుగ వాతావరణంలో నిర్వహించిన వేడుకలో.. లోకేశ్ లేకపోవటం పెద్ద లోటు అంటూ చెప్పుకొచ్చారు. ఇలా ఒక రకంగా కూటమి పార్టీల మధ్య మంచి సఖ్యత ఉంది.. ఒకరికొకరం సహకరించుకుంటున్నాం అనే సంకేతాలను కూడా తన ప్రసంగాల ద్వారా పార్టీ కేడర్‌లోకి పంపుతున్నారు పవన్. మరో పదిహేనేళ్లు కూటమిదే అధికారం అనే మాట విషయంలో ఎంత స్ట్రాంగ్ ఉన్నాననేది కూడా.. తన ప్రసంగాలతో చెప్తున్నారు పవన్.
ప్రతి మాటను లెక్కలేసి మాట్లాడుతున్న తీరు..
అప్పుడు విపక్ష నేతగా అయినా.. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అయినా.. పవన్ మాటలో వేడి తగ్గలే.. తగ్గేదే లే అని జనసేన కార్యకర్తలు అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. పవన్ కళ్యాణ్ ప్రతి మాటను లెక్కచేసి మాట్లాడుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. కూటమిలోని ప్రధాన నేతల మధ్య ఎలాంటి దూరం ఏర్పడకుండా చూసుకోవాలన్న ఆలోచన ఆయన మాటల్లో ప్రతిబింబిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. అదే సమయంలో ప్రత్యర్థుల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండే వ్యూహం కూడా ఈ ప్రసంగంలో కనిపిస్తోందన్న చర్చ కొనసాగుతోంది.
Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
