Gossip Garage : వైసీపీకి వరుస షాకుల వెనుక రీజన్‌ ఏంటి? ఉన్నట్టుండి ఆ పార్టీ నేతలు ఎందుకు గుడ్‌బై చెబుతున్నారు?

ఇదే కంటిన్యూ అయితే వైసీపీకి భవిష్యత్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు.

Gossip Garage : ఫ్యాన్‌ పార్టీ కింద ఉక్కపోత మొదలైందా..? ఉన్నట్టుండి ఆ పార్టీ నేతలు ఎందుకు గుడ్‌బై చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయా.. లేదంటే నిజంగానే వైసీపీలో ఆదరణ కరువైందని వెళ్తున్నారా.. పార్టీ సీనియర్లు కూడా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?

కండువా కప్పేసి వదిలేస్తున్నారు…
పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ నిండుదనంతో ఉంటుంది. ఒక్కసారి పవర్ పోతే.. అధికారం జారిపోతే.. చెట్టు మీద నుంచి పిట్టలు ఎగిరినట్లే నేతలు కూడా ఎగిరిపోతారు. తెలంగాణలో, ఏపీలో ఇప్పుడిదే జరుగుతోంది. తెలంగాణలో ప్రతిపక్షానికి కూడా చెప్పుకోదగ్గ సీట్లు ఉండడంతో కాంగ్రెస్ సర్కార్ భయపెట్టో, బతిమిలాడో ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంది. కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వానికి ఫుల్ మెజార్టీ ఉంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో కూటమి ప్రభుత్వానికి ఎవరినీ బుజ్జగించే అవసరమే లేదు. వస్తే వద్దంటామా.. అక్కడే ఉంటానంటే ఊరుకుంటామా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒక వేళ ఎవరైన వచ్చినా ప్రాధాన్యత ఇవ్వకుండా.. కండువా కప్పేసి వదిలేస్తున్నారు.

ఓటమి తర్వాత రాజీనామాల పర్వం..
వైసీపీకి అధికారం చేజారిపోయినప్పటి నుంచి నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి రాంరాం చెబుతున్నారు. కొందరు నేతలు మాత్రం పార్టీలో ఉన్నామా.. లేమా అన్నట్లు ఉంటున్నారు. ఏపీ ఫలితాలు వచ్చిన కొద్దీ రోజులకే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి బైబై చెప్పి జనసేనకు జైకొట్టారు. ఆ తర్వాత ఆళ్ల నాని కూడా వైసీపీని వీడారు. ఇక అప్పటి నుంచి రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. పూటకొకరు పార్టీ మారుతూనే ఉన్నారు.

ఒకేరోజు వైసీపీకి డబుల్ షాక్..
తాజాగా అవంతి శ్రీనివాస్, గ్రంధి శ్రీనివాస్ ఒకేరోజు రిజైన్ చేసి వైసీపీకి డబుల్‌ షాకిచ్చారు. అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కొద్దీ గంటలకే గ్రంధి శ్రీనివాస్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై 8వేల పైచిలుకు ఓట్ల తేడాతో సంచలన విజయం సాధించారు. కానీ 2024 ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాస్‌ను జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు చిత్తుగా ఓడించారు.

రాజీనామాకు ఐటీ దాడులే కారణమా?
ఇక నవంబర్ నెలలో గ్రంధి శ్రీనివాస్ ఆస్తులు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. భీమవరం, ఏలూరు, నాగాయలంక, సింగరాయకొండతో పాటుగా చెన్నైలోని గ్రంధి శ్రీనివాస్ ఇల్లు, బంధువుల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే వీటన్నిటిని నుంచి బయట పడాలంటే.. వైసీపీ నుంచి బయటకు రావాలని గ్రంధి శ్రీనివాస్ డిసైడైనట్లు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అందుకే ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్లు పార్టీలో ఇన్నర్ టాక్.

వైసీపీ కండువా తీసేసి కూటమిలో చేరితే సేఫ్‌గా ఉంటామని భావన?
వైసీపీలో యాక్టివ్‌గా ఉంటే కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకునేలా ఉంది. పాత కేసులను వెలికి తీసేలా ఉంది. అదే వైసీపీ కండువా తీసేసి కూటమిలో చేరితే సేఫ్‌గా ఉంటామని భావిస్తున్నారట. మరికొందరు నేతలు మాత్రం ఏ పార్టీ వైపు చూడకుండా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్తున్నారు.

వైసీపీ నేతల్లో అంతర్మథనం..
ఈ రాజీనామాల పర్వం ఇంతటితో ఆగేలా లేదు. ఇప్పటికే వైసీపీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ప్రతిపక్షహోదా కూడా లేని పార్టీలో ఉండి ఏం చేయలేమనే భావనలోకి వచ్చారు. దీంతో మరికొందరు నేతలు పార్టీ వీడే ఆలోచన చేస్తున్నారు. ఇక కొందరు నేతలైతే అసలు పార్టీలో ఉన్నారో, లేదో కూడా తెలియడం లేదు. పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే వైసీపీకి భవిష్యత్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు.

 

Also Read : వంగవీటి రాధాకు చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి? రాధాను పొలిటికల్ వెపన్‌గా మారుస్తారా?