×
Ad

MLC Marri Rajasekhar: చిచ్చు పెట్టిన మర్రి చేరిక..! చిలకలూరిపేట టీడీపీ రెండుగా విడిపోతుందా? తమ్ముళ్ల అసంతృప్తి ఎందుకు?

గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మర్రి రాజశేఖర్‌ సన్నిహితులని చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన లావు..

MLC Marri Rajasekhar: ఏపీ పాలిటిక్స్ వేరు. అందులో చిలకలూరిపేట రాజకీయం ఇంకా వేరు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీలో పాగా వేస్తే..వైసీపీ నుంచి విడదల రజిని కోట పేటలో దేక్ లేంగే అంటున్నారు. అయితే అటు వైసీపీలో..ఇటు టీడీపీలో మర్రి రాజశేఖర్ పొలిటికల్ స్టెప్పులు కాక రేపుతున్నాయి. విడదల రజినికి ఇంచార్జ్‌ బాధ్యతలు ఇవ్వడంతో అలిగిన మర్రి ఫ్యాన్ స్విచ్చాఫ్‌ చేసి సైకిల్ ఎక్కారు. అక్కడ తెలుగు తమ్ముళ్లు ఆయన రాకపై అసంతృప్తితో రగలిపోతున్నారు. దీంతో పేట రాజకీయం మరోసారి హీటెక్కుతోంది. అయితే ఇప్పుడు అక్కడున్న వైసీపీ క్యాడర్ ఫుల్ ఖుష్ అవుతోందట. మర్రి రాక పేట టీడీపీలో చిచ్చు పెట్టిందా? లీడర్ల రాజీనామాల వెనక ఉన్నదెవరు.?

మర్రి రాకను జీర్ణించుకోలేకపోతున్న రాజకీయ ప్రత్యర్థులు..!

చిలకలూరిపేట టీడీపీలో ముసలం చర్చనీయాంశంగా మారింది. మొన్నటిదాక వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌..ఆరు నెలల క్రితం ఫ్యాన్ పార్టీకి, పదవికి రాజీనామా చేసి టీడీపీ గూటికి చేరారు. ఆయన రాకతో పేట టీడీపీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరిక ఆ పార్టీలో పెను తుఫాన్ రేపుతోంది. దశాబ్దాలుగా టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేసిన మర్రి రాజశేఖర్ సడన్ ఎంట్రీని ఆయన రాజకీయ ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారట.

మర్రి చేరికను నిరసిస్తూ రాజీనామా ప్రకటనలు చేస్తున్నారు. మర్రి రాజశేఖర్ సొంత నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లోనూ ఈ ముసలం కనిపిస్తోందని చెబుతున్నారు. దీంతో ఇన్నాళ్లు ఒక్కతాటిపై నడిచిన పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయే పరిస్థితి కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.

వైసీపీలో ఉన్నప్పుడు విడదల రజినితో మర్రి రాజశేఖర్‌కు కోల్డ్ వార్ నడిచింది. ఆమెకు 2019లో టికెట్‌ ఇచ్చినప్పుడు వ్యతిరేకించిన మర్రి..జగన్ మాట విని ఎమ్మెల్సీ తీసుకుని సర్ధుకుపోయారు. 2019లోనే తనకు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని నిరాశలో కొనసాగారు. చివరకు 2024లో కూడా ఆయనకు చిలకలూరిపేట వైసీపీ టికెట్ దక్కలేదు. గుంటూరు మేయర్‌ను తీసుకొచ్చి చిలకలూరిపేటలో నిలిపారని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తూ..ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయాక కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నారు. తర్వాత మళ్లీ చిలకలూరిపేట ఇంచార్జ్‌గా విడదల రజినిని నియమించడంతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చి ఈ మధ్యే టీడీపీ గూటికి చేరారు.

ఆయన చేరికతో టీడీపీలో ముసలం స్టార్ట్..!

మర్రి వైసీపీలో ఉన్నంత కాలం అక్కడ రెండు గ్రూపులు నడిచాయి. విడదల వర్గం ఒకటైతే..మర్రిది మరో వర్గంగా ఫ్యాన్ పార్టీ విడిపోయినట్లు కనిపించింది. ఇప్పుడు ఆయన టీడీపీలోకి చేరడంతో అక్కడ ముసలం స్టార్ట్ అయింది. ఎమ్మెల్సీ మర్రి చేరికపై తమకు కనీస సమాచారం లేదన్న ఆగ్రహంతో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. వీరంతా ఎమ్మెల్యే ప్రత్తిపాటికి బాసటగా నిలుస్తున్నట్లు చెబుతున్నారు.

దశాబ్దాలుగా టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేసిన మర్రిని నియోజకవర్గ నేతలకు చెప్పకుండా ఎలా పార్టీలోకి తీసుకుంటారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వర్గం ప్రశిస్తోందట. ఆరు నెలలుగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతున్నా, పార్టీ నుంచి తమకు కనీస సమాచారం కూడా లేదని అంటున్నారు. దీంతో రెండు రోజులుగా చిలకలూరిపేట టీడీపీలో అలజడి కనిపిస్తోంది. అయితే జిల్లా, రాష్ట్ర పార్టీ ఇంతవరకు ఈ విషయమై జోక్యం చేసుకోకపోవడం మరింత వేడి పుట్టిస్తోంది.

మర్రి రాజశేఖర్‌ చేరిక వెనుక చక్రం తిప్పిన ఎంపీ?

గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మర్రి రాజశేఖర్‌ సన్నిహితులని చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన లావు.. ఇప్పుడు టీడీపీలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే మర్రి రాజశేఖర్‌ చేరిక వెనుక ఎంపీ లావు చక్రం తిప్పారన్న టాక్ వినిపిస్తోంది. పుల్లారావు వర్గం అభ్యంతరం కూడా ఇదేనని అంటున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు సన్నిహితుడైన మర్రి సైకిల్‌ ఎక్కడంపైనే పేట తెలుగు తమ్ముళ్లు గుర్రు మీదున్నారట.

అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీ కండువా కప్పుకోవడంతో చేసేదేమీ లేదని జిల్లా పార్టీ నేతలు అంటున్నారట. చిలకలూరిపేటలో ఎమ్మెల్యే పుల్లారావు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేలా మర్రికి సూచనలు చేశారని టాక్. క్యాడర్, లీడర్ల ఆగ్రహం చల్లబడే వరకు సైలెంట్‌గా ఉండాలని సజషన్స్ ఇచ్చారట.

ఏదైనా మర్రి చేరికతో టీడీపీలో ముసలం స్టార్ట్ అయినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైతే పెద్ద సమస్యగా కనిపించకపోయినా..టికెట్ రేసు వచ్చేసరికి పేట రాజకీయం రంజుగా మారడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. మర్రి వర్సెస్ పుల్లారావు డైలాగ్‌ వార్‌కు తెరదీసే సిచ్యువేషన్ కూడా రావొచ్చంటున్నారు. అయితే మర్రి రాజశేఖర్‌ను మరో నియోజకవర్గంలో అకామిడేట్ చేసే యోచనతోనే ఆయనను చంద్రబాబు పార్టీలోకి తీసుకున్నారని అంటున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు. మర్రి జాయినింగ్‌తో అధికార టీడీపీలో కల్లోలం రేపగా, విపక్షం వైసీపీలో జోష్ తెప్పిస్తున్నాయని అంటున్నారు. టీడీపీలో మర్రి ముసలం ఎటు దారితీస్తుందో చూడాలి.

Also Read: కూటమి వర్సెస్ వైసీపీ.. ఎవరిది పైచేయి? ఎవరి ట్రాప్‌లో ఎవరు పడుతున్నట్లు?