Pawan Kalyan: అడవి భూమిని మింగేసే భూబకాసురులు.. కారడవిపై కన్నేసిన భూభక్షకులు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ చెట్టు నాదే.. ఈ గట్టు నాదే అంటూ రాసేసుకున్నారట. ఇప్పుడు కబ్జాకోరుల కోరలు పీకేస్తానంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇంచు భూమిని కూడా కబ్జా కానివ్వనంటూ చాలెంజ్ చేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ ఆ నేత పేరునే ఎందుకు ప్రస్తావించారు. శేషాచలం అడవి భూములపైనే ఎందుకు ఫోకస్ పెట్టారు. ఇంతకీ తూర్పు కనుమల్లో కబ్జాదారులెవరు..?
శేషాచలం అడవుల్లో కబ్జాల సామ్రాజ్యం.. చెట్టు, పుట్టను వదలని భూబకాసురులు. ఇదిగో సాక్ష్యమంటూ స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిర్గతం చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో ఆక్రమణలపై పవన్ కల్యాణ్ తీసిన ఏరియల్ వ్యూ వీడియోలు, మ్యాపింగ్స్‌తో సహా ఎక్స్‌లో పోస్ట్ చేశారాయన. తూర్పు కనుమలపై కబ్జాదారుల కన్నుపడింది. ఏకంగా 76.74 ఎకరాల భూకబ్జా బయటపడిందంటూ లెక్కలు వేసి మరీ చూపించారు పవన్ కల్యాణ్. అయితే ఈ భూములకు మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లింక్స్ ఉన్నాయంటూ రాసుకొచ్చారు పవన్ కల్యాణ్.
శేషాచలం అడవుల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. ఇవన్నీ గతంలో అటవీశాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి.. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెట్టు, గట్టు, పుట్ట దేన్నీ వదలకుండా తన కుటుంబసభ్యులకు రాసిచ్చారంటూ ఆరోపిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం. రెండు రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లోనూ పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. తన దగ్గర అన్ని నివేదికలు, వీడియోలు ఉన్నాయన్నారు.
మంగళంపేట సర్వే నంబర్ 295, 296ల్లో ఉన్న అసలు భూమి విస్తీర్ణం ఎంత..? అది కాలానుగుణంగా ఎలా పెరిగింది అనేది కీలకమైన అంశం. సర్వే నంబర్లను సబ్ డివిజన్ చేసి, అటవీ భూములను ఓ ప్రణాళిక ప్రకారం కలిపేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు పవన్ కళ్యాణ్. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఓ రకమైన భూ లెక్కలు, అడంగల్‌లో మరో రకం భూ లెక్కలు కనిపిస్తున్నాయని వివరాలతో వెల్లడించారు పవన్. వెబ్ ల్యాండ్ నమోదులోనూ మతలబు ఉన్నట్టు కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.
అసలు ఇదంతా ఎలా జరిగింది..? ఎవరి ప్రమేయం ఉందనే అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అటవీ భూముల గురించి వారి అఫిడవిట్‌లో తప్పుడు సమాచారమిచ్చారనే అంశం తన దృష్టికి వచ్చిందంటున్నారు పవన్. రికార్డుల ప్రకారం 45.80 ఎకరాలు వాళ్ల అధీనంలో ఉంటే, వెబ్ ల్యాండ్ లోకి వచ్చేసరికి ఆ భూమి 77.54 ఎకరాలుగా ఎలా చూపించారని పవన్ ప్రశ్నిస్తున్నారు.
ప్రతి వ్యక్తి ఆక్రమణ విస్తీర్ణం, కేసుల స్టేటస్ వివరాలను అటవీ శాఖ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేయాలని పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నకిలీ వెబ్ ల్యాండ్ రికార్డులు, తప్పుడు వారసత్వ హక్కులపై ప్రత్యేక విచారణకు ఆదేశాలు ఇచ్చారు. విజిలెన్స్, లీగల్ టీమ్‌లతో విచారణ జరపాలని సూచించారు. భూ సమాచారాన్ని డిజిటలైజ్ చేయాలని కూడా ఆదేశించారు. అటవీ భూములు జాతీయ ఆస్తి.. వాటిని కబ్జా చేసే వారిని విడిచిపెట్టం.. అని పవన్ కల్యాణ్ స్పష్టంగా హెచ్చరించారు. అటవీ, వన్యప్రాణి ప్రాంతాలపై దండయాత్ర చేసిన వారికి కఠిన చర్యలు తప్పవని ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
రాష్ట్రంలో ఎన్నో భూకబ్జాలు ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏరికోరి పెద్దిరెడ్డి పేరు ప్రస్తావించడం వెనుక రీజన్ ఏంటని ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో చర్చ మొదలైంది. నిజానికి గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను పిఠాపురంలో ఓడించడానికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ అన్ని విధాలుగా ట్రై చేసింది. అప్పట్లో మిథున్‌రెడ్డి కాకినాడ పార్లమెంట్ వైసీపీ ఇన్‌చార్జిగా ఉండి.. పిఠాపురంలో పవన్‌ను ఓడించడానికి అన్ని అస్త్రశస్త్రాలను ఉపయోగించారు. అయితే కూటమి తుఫాన్ ముందు వాళ్ల వ్యూహాలు ఫలించలేదు. అందుకే ఇప్పుడు పెద్దిరెడ్డి తప్పులను వెతికేపనిలో పడ్డారట పవన్ కల్యాణ్. ఎక్కడ ఏ చిన్న సాక్ష్యం దొరికినా కూపీ లాగి పెద్దిరెడ్డిని ముప్పతిప్పలు పెడుతున్నారట. అందుకే ఇప్పుడు శేషాచలం అడవుల కబ్జాలపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్స్.
ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రిపోర్ట్ నివేదిక వచ్చాక చర్యలు తప్పవంటున్నారు పవన్. అయితే పవన్ వీడియోపై పెద్దిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.