Why Not Pulivendula: నువ్వా నేనా? పంతం నీదా నాదా? ఇలాంటి డైలాగ్స్ ఏపీ పాలిటిక్స్‌కు కరెక్ట్‌గా సూట్ అవుతాయి. ఎవరు పవర్‌లో ఉన్నా..అపోజిషన్ మీద అప్పర్ హ్యాండ్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. స్టేట్ పాలిటిక్సే కాదు..నియోజకవర్గాల స్థాయిలో కూడా ఇదే ఫైట్ నడుస్తుంటుంది. అది కూడా..సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాకాల్లో ఒకరిపై మరొకరు పట్టు సాధించే స్కెచ్ కామన్ అయిపోయింది. వైనాట్ కుప్పం అన్న వైసీపీ బొక్కబోర్లా పడింది. ఇప్పుడు వైనాట్ పులివెందుల అంటున్న టీడీపీ జగన్‌కు ఝలక్ ఇవ్వగలదా? వైసీపీ అధినేత అడ్డాలో పాగా వేసేందుకు చంద్రబాబు వేస్తున్న స్కెచ్‌లు ఏంటి?
ఏ పార్టీ పవర్‌లో ఉన్నా..ఆ రెండు నియోజకవర్గాల్లో మాత్రం గెలుపు వాళ్లదే. అవే కుప్పం, పులివెందుల. ఈ రెండు సెగ్మెంట్లు రాయలసీమలోనే ఉంటాయి. కుప్పం చంద్రబాబుకు సొంత ఇలాకాగా మారితే.. పులివెందుల వైఎస్ఆర్ టైమ్ నుంచి ఇప్పుడు జగన్ వరకు వాళ్ల ఫ్యామిలీకి అడ్డాగా ఉంటోంది. అయితే వైఎస్సార్ ఉన్నంత వరకు ఆయన కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టే వారు కాదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా పులివెందులలో ప్రత్యేక దృష్టి పెట్టి పని చేసింది లేదు.
కానీ 2019లో ఏపీలో వైసీపీ పవర్‌లోకి వచ్చాక ఓ స్లోగన్ బలంగా వినిపించింది. అదే వైనాట్ కుప్పం. ఈ నినాదం బిగ్ రీసౌండ్ చేసింది. చంద్రబాబునే ఓడిస్తామంటూ వైసీపీ నేతలు ఓ రేంజ్‌లో సవాళ్లు చేసే వారు. కట్ చేస్తే 2024కు వచ్చే సీన్ సితార అయిపోయింది. వైసీపీకి ఘోర పరాభవమే కాదు.. పులివెందులలో కూడా గతంలో కంటే జగన్‌కు మెజార్టీ తగ్గింది. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ వైనాట్ పులివెందుల అని అంటోంది. అందుకు తగ్గట్లుగానే..పులివెందుల జడ్పీటీసీ బై ఎలక్షన్ వస్తే పట్టుబట్టి గెలిచి తీరింది టీడీపీ.
చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య దశాబ్దానికిపైగా సాగుతున్న పొలిటికల్ ఫైట్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంటుంది. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి..తిరిగి పూర్వ వైభవం సాధించాలని కలలు కంటోంది వైసీపీ. ఇంకో పదేళ్లకు పైగానే పవర్ ఉండేలా వ్యూహాలు రచిస్తున్న సీఎం చంద్రబాబు..జగన్ అడ్డా పులివెందులలో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. బీటెక్ రవి లాంటి నేతను ఫ్రంట్ లైన్‌లో పెట్టి..జగన్‌ను ఢీకొడుతున్నారు.
ఇప్పటికే బీటెక్ రవి సతీమణి.. పులివెందుల జడ్పీటీసీ బైపోల్‌లో గెలవడంతో..అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓడించి తీరుతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే వారి కాన్ఫిడెన్స్ వెనక పెద్ద రీజనే ఉందన్న టాక్ వినిపిస్తోంది. పులివెందులకు నీళ్లిచ్చాకే..కుప్పంకు నీళ్లు తీసుకెళ్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. చెప్పినట్లుగా కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి పులివెందులకు సాగునీరు ఇవ్వడంలో ఓ అడుగు ముందుకు వేశారు.
దొరికిన ఛాన్స్ ని సద్వినియోగం చేసుకుంటున్న చంద్రబాబు..
ఇక ప్రతి ఊరికి 24 గంటలు తాగునీరు సప్లై చేసేందుకు వాటర్‌గ్రిడ్ పనులు చేపడుతున్నారు. వెయ్యి కోట్లతో డీపీఆర్ కూడా రెడీ చేశారు. వైసీపీ హయాంలోనే రూ.480 కోట్లతో కేంద్ర, రాష్ట్ర, జలజీవన్ నిధులతో వాటర్‌గ్రిడ్‌కు అడుగు వేశారు. ప్రతి ఒక్కరికీ రోజుకు వంద లీటర్ల నీరు ఇవ్వాలనుకున్నారు. అయితే ఈ పనులు పూర్తి కాకుండానే జగన్ అధికారంలో నుంచి దిగిపోయారు. దీంతో చంద్రబాబు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పనుల్ని కొనసాగిస్తున్నారు. పులివెందులలో వాటర్ గ్రిడ్ కోసం 1,110 కిలోమీటర్ల పైపులైన్ వేయాల్సి ఉండగా ఇప్పటికే 950 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఈ పనుల్ని డిసెంబర్ 20 కల్లా పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు డెడ్ లైన్ కూడా పెట్టారు. దీంతో వాటర్ గ్రిడ్ పనులు స్పీడ్‌గా జరుగుతున్నాయి.
అభివృద్ధి ఎజెండాతోనే జగన్‌కు షాక్ ఇచ్చే ప్లాన్..!
ఇవి పూర్తి కాగానే ఎట్టి పరిస్దితుల్లోనూ న్యూఇయర్‌లో పులివెందులకు తాగునీరు అందించి..అభివృద్ధి ఎజెండాతోనే జగన్‌కు షాక్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నారట చంద్రబాబు. వైనాట్ కుప్పం అన్నారు కాబట్టి..వైనాట్ పులివెందుల అంటున్నామని కాకుండా..చెప్పిన మాట చెప్పినట్లు..ప్రతి హామీని అమలు చేస్తున్నామని..పులివెందుల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని చెప్పాలనుకుంటున్నారట. అందుకే వాటర్ గ్రిడ్ పనులను మిషన్ మోడ్‌లో చేపట్టి..నీళ్లిచ్చిన క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని టీడీపీ ఆరాటం అంటున్నారు. జగన్ అడ్డాలో చంద్రబాబు వేస్తున్న మాస్టర్ స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.