Gossip Garage : వైసీపీని వీడి బీజేపీలో చేరిన ఆడారి ఆనంద్.. కూటమి పార్టీల్లో చిచ్చు రాజేసిందా?

అసలు ఎవరి అండతో ఆనంద్ కమలదళంలో చేరారని నేతలంతా ఆరా తీస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం చక్కబెట్టిన ఆడారి ఆనంద్.. పొలిటికల్ స్కెచ్ చూసి ఇప్పుడు ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Gossip Garage Adari Anand Kumar

Gossip Garage : జంపింగ్‌ జపాంగ్ పరిణామాలతో.. విశాఖ జిల్లా రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయ్. రోజుకో నేత బైబై చెప్తుండడంతో.. వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. వైసీపీకి హ్యాండ్ ఇస్తున్న నేతలు.. కూటమి పార్టీల వైపు చూస్తుండగా.. పాలిటిక్స్‌ను మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయ్. పీకల్లోతు రాజకీయ కష్టాల్లో మునిగిపోయిన ఓ నేత ఇప్పుడు కూటమి పార్టీలో చేరడం.. కొత్త పంచాయితీకి కారణం అవుతోంది. ఇంతకీ ఎవరా నేత.. ఏం జరుగుతోంది.. ఆయన ఎందులో చేరితే ఏంటి.. కూటమిలోని మిగతా పార్టీలకు ఎందుకు సమస్య..

విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఉన్న ఆడారి ఆనంద్ కుమార్.. గత ఎన్నికల్లో వైజాగ్ వెస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఐతే ఆయన ప్రస్తుతం విశాఖ డెయిరీ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య.. వైసీపీకి గుడ్‌బై చెప్పిన ఆడారి.. బీజేపీలో చేరిపోయారు. ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో.. ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఆనంద్‌తో పాటు యలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ రమాకుమారి, ఇతర బోర్డు డైరక్టర్లు కూడా బీజేపీ గూటికి చేరిపోయారు.

ఆడారి ఆనంద్‌ను పార్టీలో చేర్చుకోవడంపై అయ్యన్నపాత్రుడు అసహనం..
ఇదే ఇప్పుడు విశాఖ జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఆడారి ఆనంద్‌ను పార్టీలో చేర్చుకోవడంపై.. టీడీపీ సీనియర్‌ నేత, శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు.. పరోక్షంగా అసహనం వ్యక్తం చేయడం.. ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Adari Anand Joins Bjp(Photo Credit : Facebook)

టీడీపీ, జనసేనలో చేరేందుకు చాలా ప్రయత్నాలు..
తాను వైసీపీలోనే కొనసాగితే.. విశాఖ డెయిరీ వ్యవహారంలో ఇబ్బందులు తప్పవని గ్రహించిన ఆడారి ఆనంద్‌.. సడెన్‌గా ఫ్యాన్ పార్టీకి బైబై చెప్పేశారు. టీడీపీ, జనసేనలో చేరేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఒకప్పుడు టీడీపీలో పని చేసి ఆ తర్వాత వైసీపీకి వచ్చిన ఆనంద్‌.. మళ్లీ సైకిల్‌ పార్టీ గూటికి చేరేందుకు చేయని ప్రయత్నాలు లేవ్‌. ఐతే స్పీకర్ అయ్యనపాత్రుడు.. గుర్రుగా ఉండటంతో అది సాధ్యం కాలేదు.

Also Read : గ్యాస్ సిలిండర్, కార్ల ధరల నుంచి వీసా నిబంధనల వరకు.. 2025లో రాబోయే కొత్త రూల్స్ ఇవే!

జనసేనలో చేరేందుకు ప్రయత్నించినా.. చివరి నిమిషంలో బెడిసికొట్టింది. ఆ పార్టీల నాయకత్వాలు సుముఖంగా లేకపోవడంతో బీజేపీని సంప్రదించారు. చివరికి కమలం గూటికి చేరుకున్నారు. ఇదే ఇప్పుడు కూటమి పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పార్టీలో చేర్చుకునే అంశంపై.. కూటమి పార్టీల్లో డిస్కషన్ జరుగుతుందని వైజాగ్‌ పొలిటికల్ టాక్.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పార్టీలో చేర్చుకొని ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నట్లు?
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక విశాఖ డెయిరీలో ఆర్థిక అవకతవకలపై పలు ఫిర్యాదులు అందాయ్‌. శాసనసభలోనూ చర్చ జరిగింది. ఈ ఫిర్యాదులపై విచారణకు సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన సభాసంఘం.. ఈ మధ్య విశాఖ వెళ్లి డెయిరీ అధికారులతో సమావేశమైంది. డెయిరీ వివాదంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని.. పార్టీలో చేర్చుకొని.. జనాలకు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నట్లు అని టీడీపీ నేతలు అంటున్నారు.

వైసీపీకి కూడా ఆయుధంగా మారే అవకాశాలు..
నేరుగా సీఎం చంద్రబాబు దగ్గర స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు.. ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వ్యవహారం.. వైసీపీకి కూడా ఆయుధంగా మారే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అవినీతి ఆరోపణలు చేసి.. ఇప్పుడు అదే వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటున్నారు అంటే.. ఇదేం విధానం అని.. కూటమి సర్కార్‌ను నిలదీసేందుకు వైసీపీకి బలం వచ్చినట్లు అవుతుందనే చర్చ జరుగుతోంది.

ఆడారి ఆనంద్‌.. బీజేపీలో చేరడం.. ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్ అవుతోంది. అసలు ఎవరి అండతో ఆనంద్ కమలదళంలో చేరారని నేతలంతా ఆరా తీస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం చక్కబెట్టిన ఆడారి ఆనంద్.. పొలిటికల్ స్కెచ్ చూసి ఇప్పుడు ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఏమైనా ఆయన చేరిక ఇప్పుడు కూటమి పార్టీలోనే కాదు.. రాష్టవ్యాప్తంగా రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది.

 

Also Read : అయ్యో.. అయ్యయ్యో..! అనవసరంగా బీఆర్ఎస్‌ను వీడామని ఆ జిల్లా నేతలు ఆవేదన చెందుతున్నారా?