×
Ad

Ysrcp: సీమలో బలమైన ఆ సామాజికవర్గాన్ని వైసీపీ అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదు?

ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో సీమలో మళ్లీ వైసీపీకి నష్టం తప్పదని అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా రాయలసీమలో..

Ys Jagan Representative Image (Image Credit To Original Source)

  • రాయలసీమలో కీలక ఓటు బ్యాంకుగా ఉన్న బలిజలు
  • వైసీపీలో బలిజలకు ప్రాధాన్యత దక్కడం లేదా?
  • గత ఎన్నికల్లో సీమలో బలిజలకు టికెట్‌ ఎందుకు ఇవ్వనట్లు?
  • వైసీపీ బలిజ సామాజికవర్గ నేతల భేటీ వెనుక ప్లానేంటి?

Ysrcp: బలమైన సామాజికవర్గం. సీమలో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు వాళ్లది. కానీ ఫ్యాన్ పార్టీలో ఆ సామాజిక వర్గానికి దక్కాల్సినంత ప్రాధాన్యత దక్కట్లేదట. గత ఎన్నికల్లో ఆ వర్గానికి చెందిన ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలేంటి? వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ ఇచ్చే దిశగా ఫ్యాన్ పార్టీ ఆలోచన చేయడం లేదా? సీమలో బలమైన ఆ సామాజిక వర్గం దూరం అవుతున్నా వైసీపీ అధిష్ఠానం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంతకు ఏంటా సామాజిక వర్గం?

సోషల్ ఇంజనీరింగ్ పేరుతో వైసీపీ అధినేత జగన్ గత ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలకు సమానమైన ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే జగన్ అంచనాలు తప్పడంతో వైసీపీకి ఓటమి తప్పలేదు. టికెట్ల విషయంలో అంతలా కసరత్తు చేసిన జగన్ రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఓ సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాలు ఉన్నాయి.

సీమలో బలిజ సామాజికవర్గ జనాభా 27శాతం..

సీమలో బలిజ సామాజిక వర్గ జనాభా 27 శాతం వరకు ఉంది. తమ జనాభా ప్రకారం కనీసం 20 అసెంబ్లీ, నాలుగు ఎంపీ స్థానాలు కేటాయించాలని రాజకీయ పార్టీలను ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు బలిజ సామాజిక వర్గం నేతలు. ఇంతలా ఒకవైపు డిమాండ్లు వినిపిస్తున్నా..52 నియోజక వర్గాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ సామాజిక వర్గానికి కేటాయించ లేదు వైసీపీ. ఒక్క రాయలసీమలోనే కాదు నెల్లూరు జిల్లాతో పాటు, ప్రకాశం జిల్లా వరకు కూడా ఒక్క బలిజ నేతకు వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు.

రాయలసీమ జిల్లాల్లో కీలకంగా ఉన్న బలిజ సామాజిక వర్గ నేతలను పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఆ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. రాయలసీమలోని చాలా నియోజకవర్గాల్లో బలిజ సామాజిక వర్గం గెలుపోటములను డిసైడ్‌ చేసేంత బలంగా ఉంది. జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట, రైల్వే కోడూరు, కడపతో పాటు బద్వేల్‌, మైదుకూరు, జగన్ సొంత నియోజక వర్గం పులివెందుల నియోజకవర్గాల్లోనూ బలిజ సామాజిక వర్గం ఓటర్లే అభ్యర్థులను గెలుపు తీరాలకు చేరుస్తారనేది రాజకీయ వర్గాల్లో ఉన్న చర్చ.

అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లి, పలమనేరు, పుంగనూరు, తంబళ్లపల్లి, చిత్తూరు నియోజకవర్గాల్లో కూడా బలిజల ఓటు బ్యాంకు ఎక్కువ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం, అనంతపురం అర్బన్, రాయదుర్గం, పుట్టపర్తి, కదిరి, పెనుగొండ, ధర్మవరం, తాడిపత్రి వంటి నియోజక వర్గాల్లో పార్టీల గెలుపును డిసైడ్ చేసేది వారేనట.

చిరంజీవి పార్టీ గెలవడానికి ప్రధాన కారణం ఆ వర్గం ఓట్లే..

కర్నూల్ జిల్లాలో నంద్యాల, కర్నూల్, ఆళ్లగడ్డ, డోన్, బనగాన పల్లె నియోజక వర్గాల్లో బలిజ ఓటర్లు అధికంగా ఉన్నారు. గతంలో చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజక వర్గాల్లో గెలవడానికి ఈ సామాజిక వర్గం ఓట్లు ప్రధాన కారణమని వైసీపీలోని బలిజ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ వైసీపీలో మాత్రం ఆ సామాజిక వర్గం నేతలకు ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఒక్క బలిజ నేతకు టికెట్ ఇవ్వకపోగా..ప్రస్తుతం అసెంబ్లీ ఇంచార్జ్‌గా కూడా ఆ సామాజిక వర్గానికి చెందినవారెవరూ లేరు. కేవలం నియోజకవర్గ పరిశీలకులుగా మాత్రమే ఒకరిద్దరు నేతలు ఉన్నారు.

వైఎస్ హయాంలో బలిజలు ఆ కుటుంబానికి సానుకూలంగా ఉండేవారు. అయితే ప్రజారాజ్యం తర్వాత జనసేన పార్టీతో బలిజలు కొంత వైఎస్ కుటుంబానికి దూరమయ్యారు. దీంతో వైసీపీ ఆ సామాజిక వర్గంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని సీమ పాలిటిక్స్‌లో చర్చ జరుగుతోంది. గతం ఎలా ఉన్నా ఇప్పుడు బలిజలకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి తెస్తున్నారు కొందరు వైసీపీ నేతలు. ఇటీవలే వైసీపీ బలిజ నేతలు ఓ సమావేశం పెట్టుకున్నారని సమాచారం. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారట.

వచ్చే ఎన్నికల్లో సీమలో మళ్లీ వైసీపీకి నష్టం?

త్వరలోనే సీమ వైసీపీ బలిజ నేతలు ఓ సమావేశం నిర్వహించి డిమాండ్‌ను అధిష్టానం ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. కాపులను దగ్గర చేసుకునేందుకు ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్న వైసీపీ..సీమలో బలిజలను పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేతలు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో సీమలో మళ్లీ వైసీపీకి నష్టం తప్పదని అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా రాయలసీమలో 27 శాతం వరకు జనాభా ఉన్న బలిజలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో కొద్దిమందికి అయినా టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. పవన్ కల్యాణ్ ప్రధాన ఓటు బ్యాంకు అయిన బలిజలను జగన్ తనవైపు తిప్పుకుంటే సీమ జిల్లాలో వైసీపీకి తిరుగు ఉండదనేది ఆ పార్టీ నేతల ఒపీనియన్‌. రానున్న రోజుల్లో జగన్ వారికి ప్రయారిటీ ఇస్తారా లేదంటే పక్కన పెడతారా వేచి చూడాలి.

Also Read: ఆయన అలా, ఈయన ఇలా.. టీడీపీకి తలనొప్పిగా మారిన పీలా సోదరులు..! తమ్ముళ్లు ఎందుకు రగిలిపోతున్నారు?