×
Ad

Ysrcp Digital Book: కూటమిని ఇరుకున పెట్టాలనుకున్న జగన్ అస్త్రం.. వైసీపీ మెడకే చుట్టుకుంటుందా?

అలా డిజిటల్‌ బుక్‌లో చేంజెస్‌తో చేస్తే సొంత పార్టీ నేతలపై ఫిర్యాదులకే భయపడే మార్చినట్లు అవుతుందని కూడా భావిస్తున్నారట.

Ysrcp Digital Book: అసలే విపక్షంలో ఉన్నారు. పవర్‌ పోయి పరేషాన్‌లో కొనసాగుతున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా చాలా నియోజకవర్గాల్లో వైసీపీ సైలెంట్‌ మోడ్‌లోనే ఉందట. కొన్ని నియోజకవర్గాల్లో అయితే అంతర్గత ముసలం రాజుకుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేని.. అప్పుడు పదవులు ఇస్తామని పైసలు తీసుకుని హ్యాండ్ ఇచ్చారని ఇప్పుడు రచ్చకెక్కతున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. అంతేకాదు వైసీపీ డిజిటల్‌ బుక్‌లో సొంత పార్టీ నేతపై లోకల్ లీడర్లు ఫిర్యాదులు చేస్తుండటం కలకలం రేపుతోంది. సొంత పార్టీ నేతలపై వచ్చిన ఫిర్యాదులపై వైసీపీ యాక్షన్ తీసుకుంటుందా? ఇల్లు చక్కబెట్టుకోకపోతే ఫ్యాన్‌ పార్టీకి కష్టమేనా?

అప్పుడు కూటమి పార్టీలు ఆరోపించాయి. ఇప్పుడు సొంత పార్టీ నేతలు రచ్చకెక్కుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉన్న వైసీపీ లీడర్లు.. ఇప్పుడు అపోజిషన్‌లోకి వచ్చేసరికి తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పనిచేసిన నేతలు తమకు ఏం నష్టం చేశారో వివరిస్తూ ఏకంగా వైసీపీ అధినేత జగన్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు.

విడదల రజినిపై అక్రమ వసూళ్లు..!

చిలకలూరిపేటలో మాజీమంత్రి విడదల రజినిపై గ్రానైట్ ఫ్యాక్టరీ నుంచి వసూళ్లు అంటూ ఫిర్యాదులు వెళ్లాయి. లేటెస్ట్‌గా రజిని తన ఇల్లు, కారుపై దాడి చేయించారని ఆరోపిస్తూ, నవతరం పార్టీ అధ్యక్షుడు వైసీపీ డిజిటల్‌ బుక్‌కు ఫిర్యాదు చేశారు. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర అంశంగా మారితే..వైసీపీ అంతర్మథనానికి దారితీసింది. అయితే ఆ ఇష్యూ మర్చిపోకముందే ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాల్లో మరో ఎపిసోడ్‌ వెలుగులోకి వచ్చింది.

మడకశిర వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై తీవ్ర ఆరోపణలతో కూడిన ఫిర్యాదులు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి తన వద్ద నుంచి రూ. 25 లక్షలు తీసుకున్నారని కౌన్సిలర్ ప్రియాంక, ఆమె తండ్రి విక్రమ్ ఆరోపించారు. వారు వైసీపీ డిజిటల్ బుక్‌లో తమ ఫిర్యాదును నమోదు చేశారు. ఇదే తరహాలో అంగన్‌వాడీ హెల్పర్ ఉద్యోగం కోసం తన దగ్గర రూ.75 వేలు తీసుకున్నారని దొక్కలపల్లి గ్రామానికి చెందిన రామరాజు అనే వ్యక్తి కూడా తిప్పేస్వామిపై కంప్లైంట్ చేశారు.

డిజిటల్‌ బుక్‌ బూమరాంగ్ అవుతుందా?

టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెడ్ బుక్‌కు దీటుగా, తమ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేసే వారి వివరాలు నమోదు చేసేందుకు వైసీపీ అధినేత జగన్ ఈ డిజిటల్ బుక్‌ను ప్రారంభించారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ బుక్‌లోని ఫిర్యాదులపై విచారణ జరిపి, దోషులను చట్టం ముందు నిలబెడతామని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు సొంత పార్టీ నేతపైనే అక్రమ వసూళ్ల ఆరోపణలు రావడంతో డిజిటల్‌ బుక్‌ బూమరాంగ్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. కూటమిని ఇరుకున పెట్టాలనుకున్న అస్త్రం, ఇప్పుడు తమ మెడకే చుట్టుకోవడంతో వైసీపీ అధిష్ఠానం డైలమాలో పడినట్లు తెలుస్తోంది.

కూటమి సర్కార్‌తో కూటమి పార్టీల నేతలతో సఫర్ అవుతున్న వైసీసీ నేతలకు భరోసా కల్పించేందుకు జగన్ డిజిటల్‌ బుక్‌ను తీసుకొచ్చారు. అయితే కూటమిపై ఫిర్యాదులు ఏమో గానీ సొంత పార్టీ నేతలపైనే ద్వితీయ శ్రేణి నేతలు కంప్లైంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ బుక్‌ను ఓపెన్‌ బుక్‌గా కాకుండా..పార్టీ క్యాడర్‌కు మాత్రమే అందుబాటులో ఉండేలా మార్పులు చేర్పులు చేయాలని ఆలోచన చేస్తున్నారట. అలా డిజిటల్‌ బుక్‌లో చేంజెస్‌తో చేస్తే సొంత పార్టీ నేతలపై ఫిర్యాదులకే భయపడే మార్చినట్లు అవుతుందని కూడా భావిస్తున్నారట.

అయితే అధికార కూటమిపై అటాక్ చేయాలంటే..ముందుగా సొంత పార్టీ నేతలపై వస్తున్న ఫిర్యాదులపై స్పందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుందట. ముందు ఇల్లు చక్కబెట్టుకుని తర్వాత రచ్చకెక్కాలని పలువురు నేతలు సూచిస్తున్నారట. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పలువురు ఎమ్మెల్యేల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అప్పుడు ఫ్యాన్ పార్టీ పవర్‌లో ఉండటంతో చాలా మంది బయటికి వచ్చి తమ వాయిస్ వినిపించలేకపోయారట.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండటంతో కంప్లైంట్ చేస్తే విచారణ చేసి..తమ డబ్బులు తమకు ఇప్పించడమో లేక యాక్షన్ తీసుకోవడమో జరుగుతుందని..ఫ్యాన్ పార్టీ లోకల్‌ లీడర్లు రచ్చకెక్కుతున్నారట. పనిలో పనిగా వైసీపీ డిజిటల్ బుక్‌లో కూడా ఫిర్యాదులు చేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది.

ఈ వ్యవహారంలో వైసీపీ పెద్దలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సొంత పార్టీ నేతలపై వస్తున్న ఫిర్యాదులను లైట్ తీసుకుని..కూటమిపై గళమెత్తితే అక్కడి నుంచి రివర్స్ అటాక్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పైగా వైసీపీ నేతలపై డిజిటల్‌ బుక్‌కు వచ్చిన కంప్లైంట్స్‌ను కూటమి అడ్వాంటేజ్‌గా మార్చుకునే అవకాశం లేకపోలేదు. డిజిటల్ బుక్ ఫిర్యాదుల దుమారానికి వైసీపీ ఎలా చెక్ పెట్టబోతుందో చూడాలి.

Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పర్యాటక రంగంలో వినూత్న ప్రయోగం.. ఆ వాహనాలు ఉన్న వారికి గుడ్‌న్యూస్..