Ys Jagan Representative Image (Image Credit To Original Source)
Ys Jagan: అండగా నిలిచింది వాళ్లు. పార్టీని నిలబెట్టింది కూడా కార్యకర్తలే. కట్ చేస్తే 2019లో పవర్‌లోకి వచ్చాక వాళ్లకే పవర్ లేకుండా పోయింది. హర్ట్ అయిన క్యాడర్..2024 ఎన్నికల్లో జగన్‌కు దూరమయ్యారన్న టాక్ ఉంది. అందుకే జగన్ రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. కార్యకర్తలకే టాప్ ప్రయారిటీ..మళ్లీ అధికారంలోకి వస్తే పాలన మొత్తం క్యాడర్ చేతిలో పెడుతా అంటూ భరోసా కల్పిస్తున్నారు. ఓటమి జగన్‌లో మార్పు తీసుకొచ్చిందా? క్యాడర్ సహకారం లేకపోతే గెలవడం కష్టమని ఫీల్ అవుతున్నారా?
పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు..వాళ్లే కీలకం. భవిష్యత్‌లో పార్టీ నిలబడాలన్నా క్యాడర్ స్ట్రాంగ్‌గా ఉండాల్సిందే. 2024 సీన్ రిపీట్ కావొద్దంటే..క్యాడర్‌కు ప్రయారిటీ ఇవ్వాల్సిందే. అందుకే ముందు క్యాడర్..తర్వాతే ఎవరైనా అంటున్నారట వైసీపీ అధినేత జగన్. నిత్యం కార్యకర్తలతో భేటీ అవుతూ ఫ్యూచర్‌పై భరోసా కల్పిస్తున్నారు. మళ్లీ వచ్చేది మనమే..ఎక్కడా తగ్గకుండా పోరాడండి అంటూ ధైర్యం నూరిపోస్తున్న జగన్..ఈ క్రమంలోనే క్యాడర్‌కు పెద్ద హామీ ఇచ్చేశారు. పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే పాలన మొత్తం కార్యకర్తల చేతుల మీదుగానే నడిపిస్తామని..అంటే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కార్యకర్తల మాటే చెల్లుబాటు అవుతుందని చెప్పకనే చెప్పారు జగన్. ఈ హామీతో కార్యకర్తలు హ్యాపీ అయ్యేనా.? తిరిగి 2019కు ముందు నాటి కసితో పోరాడేనా అన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.
వైసీపీ అధికారంలోకి రావాలని ఏకంగా పదేళ్ల పాటు కార్యకర్తలు పార్టీ జెండా మోశారు. 2009లో వైఎస్సార్ మరణం తర్వాత జగన్ వెంట చేరిన క్యాడర్ 2019 దాకా ఏమీ ఆశించకుండా పార్టీ కోసం కష్టపడ్డారు. ఈ దశాబ్ద కాలంలో వారు ఎంతో కోల్పోయారు. తమ సమయం, వయసు, ఆదాయం అన్నీ కూడా పెట్టుబడిగా పెట్టిన వారున్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంతో..విభజన ఏపీలో టీడీపీ ప్రభుత్వంతో పోరాడి ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నీ పడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయితే తమ హవా నడుస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ 2019లో పవర్‌లోకి రాగానే తమకు కనీస గుర్తింపు ఇవ్వలేదన్న ఆవేదన వైసీపీ క్యాడర్‌లో ఉంది.
వాలంటీర్లను ముందు పెట్టి సంక్షేమ పథకాలను ఇచ్చేయడంతో జనంలో తమకు వ్యాల్యూ లేకుండా పోయిందని..కష్టపడి పనిచేస్తే కనీసం పలుకుబడి లేకుండా చేశారని క్యాడర్ ఆవేదన, నిరాశతో తీవ్ర మనోవేదనకు గురై అయ్యారన్నది ఓపెన్ సీక్రెట్. అందుకే 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఫ్యాన్ పార్టీ క్యాడర్ పూర్తిగా హ్యాండ్సప్ అని చేతులు ఎత్తేయడంతో కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా..కూటమికి భారీ మెజార్టీ వచ్చింది. దీంతో వైసీపీ పెద్దలకు తాము చేసిన తప్పు ఏంటో తెలిసి వచ్చిందని అంటున్నారు. 2024లో వైసీపీ ఓడినా ఇంత దారుణ ఓటమి చవిచూసే పరిస్థితి వచ్చేది కాదని..క్యాడర్ గట్టిగా పోరాడి ఉంటే..గౌరవప్రదమైన సీట్లు అయినా వచ్చేవని మదన పడుతున్నారట. దాంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు క్యాడర్ జపం చేస్తున్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
వైసీపీ పాలన 2.0 కనుక వస్తే క్యాడర్‌కు పెద్దపీట వేస్తామని చెబుతున్నారు. జగన్ స్వయంగా హామీ ఇస్తున్నారు. అధినేతతో సహా అందరి నోట కార్యకర్తల ప్రస్తావనే వస్తుండటంతో అసలు వాస్తవం ఏంటో గ్రహించారన్న చర్చ జరుగుతోంది. క్యాడర్ సైలెంట్‌గా ఉండటమే ఫ్యాన్ పార్టీ పెద్దలను కలవరపెడుతోందట. అందుకే నేరుగా క్యాడర్‌తో భేటీలు పెడుతూ..భవిష్యత్‌పై భరోసా కల్పిస్తున్నారని అంటున్నారు. ఏ పార్టీకి అయినా క్యాడరే ముఖ్యం. లీడర్లు వస్తుంటారు..పోతుంటారు..క్యాడర్ మాత్రం సాలిడ్‌గా పార్టీ తరఫున ఫ్రంట్ లైన్‌లో ఉంటుంది. అందుకే ఇప్పటికైనా క్యాడర్‌ను నిర్లక్ష్యం చేయకుండా..వారి మనసులో మాటను తెలుసుని..గ్రౌండ్ రియాలిటీపై రియల్ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్న సూచనలు వస్తున్నాయ్.
కార్యకర్తలే తమకు పెద్ద దిక్కు అని వైసీపీ అధినేత చెప్పడం వరకూ బానే ఉన్నా..క్యాడర్‌ను కదిలించాలంటే ఈ డోస్ సరిపోదని..ఇంకా చేయాల్సింది చాలానే ఉందని అంటున్నారు. జగన్ దిశానిర్దేశంతో కార్యకర్తలు కదనరంగంలోకి దిగుతారో లేక వెయిట్ అండ్ సీ అంటూ ఇంకా ఆలోచిస్తారో చూడాలి.
Also Read: సడెన్‌గా ఢిల్లీ టూర్.. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు.. పవన్ హస్తిన పర్యటనపై అనేక ఊహాగానాలు