పారిపోవడం తప్ప మరో ఆప్షన్ లేదా? వైసీపీ నేతలను వెంటాడుతున్న భయం ఏంటి..!

విదేశాలకు వెళదామని కొందరు ప్రయత్నించగా, పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో వీరు దేశం విడిచి వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోందంటున్నారు.

Gossip Garage : కనిపిస్తే కటకటాలే… తరుముతున్న పోలీసుల నుంచి తప్పించుకోవడమే పెద్ద సవాల్.. కోర్టులో చుక్కెదురు కావడంతో పారిపోవడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయిందా? హైకోర్టు రెడ్ సిగ్నల్‌తో సుప్రీంకోర్టు అయినా కరుణిస్తుందా? అంతవరకు అజ్ఞాతమే బెటరని అండర్‌ గ్రౌండ్‌కి వెళ్లిపోతున్నారా? కోర్టు తీర్పు వచ్చిన వెంటనే జంప్‌ అయిన నేతలు ఇప్పుడు ఎక్కడున్నారు? వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఏం చేస్తున్నారు?

రాత్రికి రాత్రే జంప్..!
కేసులు, కష్టాల నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ నేతలకు ఇప్పట్లో ఉపశమనం కనిపించే పరిస్థితి కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి తెరమరుగైన కేసులు తిరగతోడటంతో కొందరు వైసీపీ నేతలకు అరెస్టు భయం పట్టుకుంది. ఇందులో ప్రధానంగా మూడు కేసులు వైసీపీ నేతలను ఉక్కబోతకు గురిచేస్తున్నాయి. చంద్రబాబు ఇంటిపై దాడి, మంగళగిరి, గన్నవరం టీడీపీ కార్యాలయాల్లో విధ్వంసంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నేతలకు తాజాగా హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు అంతా రాత్రికిరాత్రే జంప్ అయ్యారు.

అండర్ గ్రౌండ్ లోకి కొందరు, తప్పించుకుని తిరుగుతున్న మరికొందరు..
కొందరు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోగా, మరికొందరు పోలీసులకు చిక్కకుండా దొంగా పోలీస్ ఆటకు తెరతీశారు. ఐతే నాటకీయ పరిణామాల మధ్య బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన నిందితులైన నేతల బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ అయ్యారు. తనను వెంటాడుతున్నారని బెంగళూరులో తలదాచుకున్న అప్పిరెడ్డిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు సీఐడీ పోలీసులు.

వరదల్లో విజయవాడ అతలాకుతలమైనా ఆ ఇద్దరు బయటకు రాలేదు..
ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పలువురు నేతలు టీడీపీ అధికారంలోకి వచ్చిన నుంచి అజ్ఞాత జీవితమే గడుపుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, తమ నోటికి పని చెప్పిన మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ అరెస్ట్ ముప్పును ఎదుర్కొంటున్నారు. మాజీ మంత్రి కొడాలిపై నమోదైన రెండు కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసినా, ప్రభుత్వం ఇంకేదైనా కేసులో ఇరికించి లోపలేసేస్తుందనే భయంతో కొడాలి కూడా కనిపించకుండా తిరుగుతున్నారు. వరదల్లో విజయవాడ అతలాకుతలమైనా ఈ ఇద్దరు బయటకు రాలేదు. కనీసం ఫోన్ లోనూ ఎవరినీ పలకరించలేదు. ఒకవేళ వీరు ఎవరితో ఫోన్ లో మాట్లాడినా వెంటనే దొరికిపోయే అవకాశం ఉండటంతో పూర్తిగా అజ్ఞాతవాసమే అనుభవిస్తున్నారు.

జోగి రమేశ్ కోసం పోలీసుల వేట..
ఇక తాజాగా హైకోర్టు షాక్ తో మాజీ మంత్రి జోగి రమేశ్, వైసీపీ నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడైన జోగి రమేశ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు చెబుతున్నారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని జోగి కుమారుడు రాజీవ్ ను ఇప్పటికే అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులు బెయిల్ పై రాజీవ్ బయటకు రాగా, ఇప్పుడు జోగి రమేశ్ వంతు వచ్చిందంటున్నారు.

ఎక్కువ రోజులు తప్పించుకోలేరు..
హైకోర్టు మధ్యంతర బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడంతోపాటు అరెస్ట్ కు లైన్ క్లియర్ చేయడంతో ఉన్నపళంగా జంప్ అయ్యారు జోగి రమేశ్. అదే విధంగా దేవినేని అవినాశ్, తలశిల రఘురాం సైతం ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు. పోలీసులు మాత్రం వీరిని అరెస్టు చేసేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా వైసీపీ నేతల అరెస్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో వారు ఎన్నాళ్లు తప్పించుకోలేరంటున్నారు.

Also Read : ఇక కూల్చుడేనా? ఏపీలోనూ హైడ్రా తరహా సంస్థ తీసుకొస్తున్న చంద్రబాబు సర్కార్..!

అరెస్ట్ భయంతో విదేశాలకు వెళ్లే ప్రయత్నం..
ఈ కేసుల్లో ఇప్పటికే దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి అనుచరులను పోలీసులు అరెస్టు చేయగా, వారంతా రిమాండ్ ఖైదీలుగా జైలులోనే ఉన్నారు. ఇక ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేశ్, దేవినేని అవినాశ్ టి వారికి వెంటనే బెయిల్ వచ్చే అవకాశం లేకపోవడంతో తప్పించుకుని తలదాచుకోవడమే బెటర్ అని అంతా అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారంటున్నారు. అరెస్ట్ భయంతో విదేశాలకు వెళదామని కొందరు ప్రయత్నించగా, పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో వీరు దేశం విడిచి వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోందంటున్నారు. ఇదే సమయంలో గన్నవరం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభనేనిపై లుకౌట్ నోటీసు జారీ చేయడంలో ఆలస్యం కావడంతో ఆయన అమెరికా వెళ్లిపోయారంటున్నారు. మొత్తానికి మూడు కేసులు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలకు ముప్పుతిప్పలు పెడుతున్నాయంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు