ఇక కూల్చుడేనా? ఏపీలోనూ హైడ్రా తరహా సంస్థ తీసుకొస్తున్న చంద్రబాబు సర్కార్..!

హైకోర్టు తీర్పుతో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన ఆక్రమిత స్థలంలో నిర్మాణాలను తొలగించినా, మున్ముందు వైసీపీ నేతలకు చెందిన ఆస్తులపై మరిన్ని చర్యలు ఉంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇక కూల్చుడేనా? ఏపీలోనూ హైడ్రా తరహా సంస్థ తీసుకొస్తున్న చంద్రబాబు సర్కార్..!

Gossip Garage : హైడ్రా.. హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ… తెలంగాణలో మోస్ట్‌ ట్రెండింగ్‌ అండ్‌ పాపులర్‌. విపత్తు సహాయక చర్యలు కూడా హైడ్రా బాధ్యతల్లో ఒకటైనా, ఆక్రమణ కూల్చివేతల వల్ల మోస్ట్‌ పాపులర్‌ అయింది. ఇక హైడ్రా స్ఫూర్తితో… ఏపీలోనూ అలాంటి సంస్థ పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచన చేస్తోందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె స్నేహారెడ్డికి చెందిన నిర్మాణాలు కూల్చివేతతో ఏపీ ప్రభుత్వం వైడ్రా తీసుకొస్తుందా? అనే చర్చ మొదలైంది.

తెలంగాణలోని హైడ్రా… ఏపీలో వైడ్రాగా మారబోతోందా?
తెలంగాణలోని హైడ్రా… ఏపీలో వైడ్రాగా మారబోతోందా? విశాఖ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీగా మారబోతోందా? ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఈ ప్రచారానికి తగ్గట్టు ఏపీలో కూల్చివేతల ఎపిసోడ్‌ ప్రారంభవమవడంతో వైడ్రా అనధికారికంగా పని చేయడం స్టార్ట్‌ చేసిందని టాక్‌ వినిపిస్తోంది. ఏపీలో గత ప్రభుత్వం నుంచి కూల్చివేతలు కామన్‌ అయిపోయాయనే అభిప్రాయం ఉంది. ఐతే గతంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు కూల్చివేతల ఎపిసోడ్‌ ఉండేది. ఇప్పుడు మాత్రం కోర్టు అనుమతులు, అధికారుల నోటీసులు వంటి నిబంధనలు పాటిస్తూ… చట్టప్రకారం కూల్చివేతలకు దిగుతున్నారని అంటున్నారు.

నదీ గర్భాల్లో ఆక్రమణల తొలగింపునకు ఏపీ ప్రభుత్వం సిద్ధం..
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణల తొలగింపుల్లో హైడ్రా రాజీ పడటం లేదు. ఈ విషయంలో ప్రజల నుంచి సానుకూల స్పందన ఉండటంతో ఏపీ ప్రభుత్వం ఇలాంటి సంస్థ ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించింది. విశాఖలో భూ కబ్జాలను అరికట్టడానికి హైడ్రా వంటి సంస్థను ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలిస్తామని మున్సిపల్‌ మంత్రి నారాయణ గత వారం ప్రకటించారు. ఇక తాజాగా విజయవాడ వరదలకు బుడమేరు ఆక్రమణలే కారణమని తేలింది. దీంతో నదీ గర్భాల్లో ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కూడా హైడ్రా పనితీరును అభినందించడంతో ఏపీ ప్రభుత్వం విశాఖ, విజయవాడ నగరాలకు సంబంధించి వైడ్రా ఏర్పాటు చేస్తుందా? అనే చర్చ జరుగుతోంది.

విజయసాయిరెడ్డి కుమార్తె ఆస్తుల కూల్చివేత..
తాజాగా విశాఖ సీఆర్‌జడ్‌ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని విజయసాయిరెడ్డి కుమార్తెపై హైకోర్టులో పిల్‌ వేసింది జనసేన పార్టీ. భీమిలికి సమీపంలో సముద్ర తీరానికి ఆనుకుని నాలుగు ఎకరాల్లో విజయసాయిరెడ్డి కుమార్తె ప్రహరీ నిర్మించారు. సీఆర్‌జడ్‌ నిబంధనల ప్రకారం సముద్ర తీరంలో కాంక్రీట్‌ నిర్మాణాలు చట్ట విరుద్ధం. దీంతో ఆ నిర్మాణాలను కూల్చివేయాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో అధికారులు జెట్‌ స్పీడ్‌తో నిర్మాణాలను తొలగించారు. ఐతే ఈ నిర్మాణాలు విజయసాయిరెడ్డి కుమార్తెకు చెందినవి కావడమే చర్చకు దారితీస్తోంది. గతంలో విశాఖలో పలువురు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లు, కార్యాలయాల కూల్చివేతకు విజయసాయిరెడ్డి ప్రోద్బలం ఉందని ప్రచారం జరిగింది. విజయసాయిరెడ్డి డైరెక్షన్‌లోనే గీతం కాలేజీ ప్రహరీతోపాటు, అయ్యన్నపాత్రుడు, సబ్బం హరి, పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనాలను తొలగించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో టీడీపీ నేతలకు విజయసాయిరెడ్డి టార్గెట్‌ అయ్యారనే ప్రచారం జరుగుతోంది.

Also Read : కచ్చితంగా ఉండాల్సిందే.. హైడ్రాపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

హైడ్రా వంటి సంస్థ ఏపీలో పురుడు పోసుకోబోతోందని ప్రచారం..
హైకోర్టు తీర్పుతో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన ఆక్రమిత స్థలంలో నిర్మాణాలను తొలగించినా, మున్ముందు వైసీపీ నేతలకు చెందిన ఆస్తులపై మరిన్ని చర్యలు ఉంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మున్సిపల్‌ మంత్రి నారాయణ విశాఖలో ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటామన్నప్పుడే హైడ్రా వంటి సంస్థ ఏపీలో పురుడు పోసుకోబోతోందని ప్రచారం జరిగింది. తాజాగా విజయసాయిరెడ్డి కుమార్తె ఆస్తుల కూల్చివేతతో ఆ ప్రచారానికి బలం చేకూరిందంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విజయవాడ వరద సహాయక చర్యల్లో నిమగ్నమైంది. బుడమేరు ఆక్రమణలు, విశాఖ కబ్జాలు ప్రభుత్వానికి సవాల్‌గా మారినందున ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. విజయవాడ కోలుకున్న వెంటనే సీఎం ఈ దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.