మునిగిపోయే చోటే జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చారు, సీఎం రేవంత్ చేస్తున్నది రైటే- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
చాలా కాలంగా అక్రమ నిర్మాణాలు చేసేస్తున్నారు.. అవి ఆపాలి.. ఆక్రమణలో బలమైన రాజకీయ నాయకులు ఉన్నారు.. వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పాలి..
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సమర్థించారు. హైడ్రా విషయంలో సీఎం రేవంత్ కు పవన్ మద్దతుగా నిలిచారు. హైడ్రా చేస్తున్నది రైటే అని పవన్ కల్యాణ్ అన్నారు. చెరువుల ఆక్రమణల వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయని పవన్ వాపోయారు. చెరువుల ఆక్రమణల వల్లే వరదలు పోటెత్తి నగరాలను ముంచెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మునిగిపోతాయని తెలిసినా జగన్ అక్కడే ఇళ్ల స్థలాలు ఇచ్చారు..
ఇక, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగారు పవన్ కల్యాణ్. జగనన్న కాలనీలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. జగనన్న కాలనీలన్నీ మునిగిపోయే చోటే ఏర్పాటు చేశారని పవన్ ఆరోపించారు. ముంపు ప్రాంతం అని తెలిసినా, ముంపునకు గురవుతాయని తెలిసి కూడా అక్కడే ఇళ్ల స్థలాలు ఇచ్చారని జగన్ పై మండిపడ్డారు పవన్ కల్యాణ్.
పంచాయతీ రాజ్ ఉద్యోగులు రూ.14.85 కోట్లు విరాళంగా ఇచ్చారు..
”వరదల వల్ల 3080 పంచాయతీలు ఎఫెక్ట్ అయ్యాయి. 675 టీమ్ లు పంచాయతీ రాజ్ శాఖ నుండి సహాయక చర్యల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో క్లోరినేషన్ చాలా ముఖ్యం. ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. విజయవాడలో పనిచేస్తున్న 900 మంది శానిటరీ వర్కర్స్ ను గౌరవిస్తాం. పంచాయతీ రాజ్ ఉద్యోగులు ఒక్కరోజు జీతం 14.85 కోట్లు ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు.
400 పంచాయతీలకు లక్ష చొప్పున వ్యక్తిగతంగా ఇస్తున్నా..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. వీలైనంత మంది వరద బాధితులకు సాయం చెయ్యండి. వరద ముంపునకు గురైన 400 పంచాయతీలకు లక్ష చొప్పున నేను వ్యక్తిగతంగా ఇస్తున్నా. గోదావరికి వరద వస్తుంది. కలెక్టర్లు అలెర్ట్ గా ఉండాలి. కాకినాడ ఎర్ర కాలువ నుండి 20 టీఎంసీల నీరు చేరింది. గొల్లప్రోలు గ్రామం ఎఫెక్ట్ అవుతుంది. ప్రజలను అలర్ట్ చెయ్యాలని కలెక్టర్ కు ఆదేశాలిచ్చాను.
హైడ్రా లాంటి యాక్షన్ కచ్చితంగా ఉండాలి..
హైడ్రా లాంటి వ్యవస్థ ద్వారా కొట్టేయడం కంటే ముందే నిర్మాణాలు కట్టకుండా అడ్డుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నది రైటే. అలాంటివి కొట్టేస్తాం అని చెప్పారు.. కొట్టేస్తున్నారు.. నిర్మాణాలు కొట్టేస్తే ఆర్థికంగా ఇబ్బంది పడతారు.. అందుకే ముందే కఠినమైన నిబంధనలు ఉండాలి.. చాలా కాలంగా అక్రమ నిర్మాణాలు చేసేస్తున్నారు.. అవి ఆపాలి.. హైడ్రా లాంటి యాక్షన్ కచ్చితంగా ఉండాలి.. ఆక్రమణలో బలమైన రాజకీయ నాయకులు ఉన్నారు.. వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పాలి.. వాళ్ళకి వాళ్ళే స్వచ్ఛందంగా కూల్చే విధంగా ఒప్పించాలి..
ఇప్పుడైనా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పెరుగుతాయి..
కొందరు సామాన్యులు ఇళ్లు కట్టుకున్నారు.. వాళ్ళు నష్టపోతారు.. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపాలి.. పంచాయతీ స్థాయి నుండి ఆక్రమణలో ఇల్లు కట్టకుండా ముందస్తు చర్యలు ఉండాలి.. ఇంతవరకూ అలా జరగలేదు. ఇకపై అలా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడైనా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పెరుగుతాయి” అని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read : ఏరుకన్నా తక్కువైన బుడమేరు ఉప్పెనలా విజయవాడపై విరుచుకుపడటానికి కారణం వారేనా? చంద్రబాబు అంత సాహసం చేస్తారా?