ఏరుకన్నా తక్కువైన బుడమేరు ఉప్పెనలా విజయవాడపై విరుచుకుపడటానికి కారణం వారేనా? చంద్రబాబు అంత సాహసం చేస్తారా?

ఏకధాటి వానతో బుడమేరుకు వరద వచ్చినా.. విజయవాడ నగరం మునిగిపోతుందని ఎవరూ అంచనా వేయలేదు.

ఏరుకన్నా తక్కువైన బుడమేరు ఉప్పెనలా విజయవాడపై విరుచుకుపడటానికి కారణం వారేనా? చంద్రబాబు అంత సాహసం చేస్తారా?

Budameru Floods : సాగునీటి వనరుల్లో విచ్చలవిడి విధ్వంసమే విజయవాడ ముంపునకు కారణమా? చెంతనే కృష్ణా మహోగ్రంగా ప్రవహిస్తున్నా… విజయవాడను కృష్ణమ్మ పెద్దగా కష్టపెట్ట లేదు. కానీ, ఊహించని విధంగా ఏరుకాని ఏరు బుడమేరు ఉప్పెనలా విరుచుకుపడటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సహజంగా పది పదిహేను వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండే బుడమేరు విజయవాడ నగరాన్ని అతాలకుతలం చేసింది. ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట బుడమేరుకు వరద వచ్చింది. మళ్లీ ఇప్పుడు మూడు రోజుల పాటు నగరాన్ని జలదిగ్బంధం చేసింది బుడమేరు…! నిజానికి చెప్పాలంటే బుడమేరు పెద్ద నదేమీ కాదు. దాని పరివాహ ప్రాంతం కూడా చిన్నదే.. వాగుకు కాస్త ఎక్కువ.. ఏరుకన్నా తక్కువైన బుడమేరు ముంచేయడానికి అసలు కారణమేంటి? బుడమేరు పాఠం నుంచి నేర్చుకోవాల్సిందేంటి?

విజయవాడ నగరం మునిగిపోతుందని కలలో కూడా అనుకోలేదు..
విజయవాడ నగరాన్ని జలదిగ్బంధంలోకి నెట్టిన బుడమేరు… రాష్ట్ర ప్రభుత్వానికి పాఠంగా మారింది. విజయవాడ పక్కనే మైలవరం కొండల్లో పుట్టి కేవలం 170 కిలోమీటర్లు ప్రయాణించి కొల్లేరులో కలిసే బుడమేరు ఎప్పుడూ ఇంతలా ఉధృతంగా ప్రవహించలేదని రికార్డులు చెబుతున్నాయి. ఏకధాటి వానతో బుడమేరుకు వరద వచ్చినా.. విజయవాడ నగరం మునిగిపోతుందని ఎవరూ అంచనా వేయలేదు. కానీ, ఇటు విజయవాడ నగరంలోని బుడమేరు పరివాహక ప్రాంతంతోపాటు.. అటు కొల్లేరు సంగమ ప్రాంతంలో ఆక్రమణలే విజయవాడ ముంపునకు కారణమయ్యాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

బడమేరును 90 శాతం మేర ఆక్రమించేశారు..
దాదాపు రెండు దశాబ్దాల క్రితం బుడమేరుకు వరద వచ్చింది. దీంతో విజయవాడకు ఎప్పుడైనా ముప్పు అని గ్రహించిన అప్పటి ప్రభుత్వం బుడమేరుకు డైవర్షన్‌ కెనాల్‌ నిర్మించాలని ప్రతిపాదించింది. పోలవరం కాలువలోకి బుడమేరు నీటిని మళ్లించాలని భావించింది. కానీ, ఆ ప్రతిపాదనకు ఇప్పటివరకు కార్యరూపం దాల్చేలేదు. సరికదా బుడమేరు వ్యాప్తంగా ఆక్రమణలు ఎక్కువయ్యాయి. భూమి విలువ పెరిగిపోవడంతో బుడమేరు పరివాహక ప్రాంతం రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లుగా మారింది. విజయవాడ నగరంలో సుమారు 15 కిలోమీటర్ల మేర ఉండే బడమేరును 90 శాతం మేర ఆక్రమించేశారని చెబుతున్నారు. ఈ ఆక్రమణదారులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో మున్సిపల్‌ అనుమతులు, విద్యుత్, కొళాయి కనెక్షన్లు వంటి సకల సౌకర్యాలు సమకూరాయి. ఫలితంగా బుడమేరు ప్రాంతంలో పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి.

ఆక్రమణలు తొలగించే సాహసానికి చంద్రబాబు సిద్ధమవుతారా?
తాజా వరదలతో బుడమేరు ముంచేయడంతో చంద్రబాబు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఆసక్తిని పెంచుతున్నాయి. భవిష్యత్‌లో మళ్లీ ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకూడదంటే ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ప్రభుత్వం ఏది ఎంచుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో అనుకున్నట్లు బుడమేరు వరదను పోలవరం కాలువలోకి మళ్లించడం, లేదంటే బుడమేరులోను, బుడమేరు సంగమ ప్రాంతమైన కొల్లేరులోనూ ఆక్రమణలను తొలగించడం. ఈ రెండు ప్రభుత్వం తలచుకుంటే అసాధ్యమేమీ కాదు. కానీ, ఆక్రమణలు తొలగించే సాహసానికి చంద్రబాబు సిద్ధమవుతారా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇక వరదను మళ్లించాలన్నా… వీటీపీఎస్‌ పరిసరాల్లో కాలువలు విస్తరించడం అసాధ్యమంటున్నారు. దీంతో ప్రత్యామ్నాయాలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బుడమేరు ఆక్రమణల్లో అన్ని పార్టీల నేతల ప్రమేయం
భవిష్యత్‌లో బుడమేరు వరద పోటెత్తకుండా ఉండాలంటే ప్రస్తుతం ఉన్న ఆక్రమణలను తొలగించడంతోపాటు, ఇకపై కట్టడాలు జరగకుండా చూడాల్సి వుంటుంది. కానీ, బుడమేరు ఆక్రమణల్లో అన్ని పార్టీల నేతల ప్రమేయం ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు మీరు ఆక్రమించారు… ఇకపై మా వంతు అన్నట్లు ఇరుపార్టీల నేతలు పోటాపోటీగా బుడమేరు ఆక్రమణకు ప్రోత్సహిస్తుండటంతో నీళ్లు ప్రవహించాల్సిన చోట భవనాలు వెలుస్తున్నాయి. ఈ ఆక్రమణలే బుడమేరును విజయవాడకు శాపంగా మార్చేస్తోంది. దీంతో ప్రభుత్వం ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టాలని డిమాండ్‌ తెరపైకి వస్తోంది.

ఏపీలోనూ హైడ్రా వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్..
హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా వంటి సంస్థను రాష్ట్రంలోని ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా వంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మన్సిపల్‌ మంత్రి నారాయణ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ఇప్పుడు వరదలు అలాంటి వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని తీసుకువచ్చాయంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది చూడాలి.

 

Also Read : 10 నిమిషాల వర్షానికే నదుల్లా కాలనీలు.. బెజవాడ మునిగింది అందుకేనా? ఇక్కడా బుల్డోజర్ దిగాల్సిందేనా?