Ys Jagan: పవర్ పోయి 15 నెలల అవుతుంది. ఫ్యాన్ స్పీడ్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఇదే టైమ్‌లో అక్కడక్కడ లీడర్ల మనోగతం మాత్రం బయటపడుతోంది. సీనియర్లు.. ఏదున్నా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడే పలువురు నేతలు..మనసులో మాటను, ఆవేదనను బయటపెడుతున్నారు. అధినేతకు ఆప్తులు..పార్టీ పెట్టినప్పటి నుంచి వెంట నడిచిన వాళ్లు..జగన్ తీరు, పార్టీ పనితీరు మారాల్సిందే అంటున్నారు. లేటెస్ట్‌గా మాజీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అయితే సుతిమెత్తంగా సున్నితంగానే అధినేతకు చురకలు అంటించారు. లీడర్ల స్వరం అందుకే మారుతుందా? నేతల స్ట్రెయిట్ టాక్..అధినేతకు సందేశం పంపుతోందా?
ఘోర ఓటమి సిన్సియర్, సీనియర్ ఫ్యాన్ పార్టీ లీడర్లను డైలమాలో పడేసింది. పక్క పార్టీల్లోకి వెళ్లలేరు. అలా అని అధినేత వెంట దూకుడుగా నడవలేరు. ఓవైపు కూటమి సర్కార్ తీరు..మరోవైపు తమ హయాంలో జరిగిన మిస్టేక్స్ అన్నీ బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు వైసీపీ సీనియర్లు తమ అభిప్రాయాలు ఉన్నది ఉన్నట్లుగానే చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీమంత్రి పేర్నినాని..ఇలా కొందరు నేతలు..తమ అధినేత చేసిన మిస్టేక్స్, పార్టీ నేతలు మాట్లాడిన మాటలు తమకు ఎంత డ్యామేజ్ చేశాయో ఇప్పటికే తమ వాయిస్ వినిపించారు.
జగన్ చుట్టూ భజనపరులు అంటూ ఘాటు వ్యాఖ్యలు..
ఇక లేటెస్ట్‌గా వైసీపీ పార్టీ వ్యవహారాలపై పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. జగన్ పనితీరు, గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపై రెస్పాండ్ అయిన రాజమోహన్‌రెడ్డి..మాజీ సీఎంకు వాస్తవాలు చెప్పకుండా, ఆయన చుట్టూ చేరిన వారంతా భజన చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరు ఎంపీగా పనిచేసిన రాజమోహన్‌రెడ్డి వయసు రిత్యా యాక్టీవ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. కానీ నెల్లూరు జిల్లాలో వైసీపీ రాజకీయాలను మేకపాటి కుటుంబమే పర్యవేక్షిస్తోంది. దీంతో మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడానికి జగన్ చుట్టూ ఉన్న వారే కారణమని అన్నది మేకపాటి ఒపీనియన్. జగన్‌కు గ్రౌండ్ లెవల్‌లో ఉన్న పరిస్థితులపై సరైన నిర్దేశం చేయడం లేదన్న పెద్దాయన..చుట్టూ ఉన్న వారి భజనకు ఆకర్షితుడై అధినేత ప్రజలకు దూరమయ్యారని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలు ఎందుకు తిరస్కరించారో జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న మేకపాటి..ఓటమికి కారణాలను ఎనాలిసిస్ చేసి, పార్టీ చేసిన తప్పులను రిపీట్ కాకుండా చూసుకుంటే బెటర్ అన్నారు. జగన్ అధికారంలో ఉండగా, అప్పటి ప్రతిపక్ష నేతను అరెస్టు చేయడం సరికాదన్నారు.
మాజీ సీఎం జగన్ చుట్టూ మేధావులు, మంచి సలహాలు ఇచ్చే సీనియర్లు ఉండాలన్నది మేకపాటి ఆకాంక్ష. జగన్ చుట్టూ ఉన్న నేతలు తప్పు ఎక్కడ జరుగుతుందో చెప్పకుండా, ఆయన మెప్పు కోసం భజన చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు గట్టి మద్దతుదారుగా గుర్తింపు పొందిన మేకపాటి వైసీపీ ఆవిర్భావం వెన్నంటి నడిచారు. నెల్లూరు జిల్లాలో ఆయన కుటుంబం పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటోంది. అంతేకాకుండా రాజమోహన్‌రెడ్డి కుమారుడు దివంగత గౌతంరెడ్డి మాజీ సీఎం జగన్‌కు స్నేహితుడు. దీంతో జగన్ మంచి కోరుకునే వారిలో ముందుండే రాజమోహన్‌రెడ్డి..ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వైసీపీలో చర్చకు దారితీస్తోంది.
వైసీపీని వీడి..జగన్‌తో ఉన్న బంధాన్ని తెంచుకున్న విజయసాయిరెడ్డి కూడా జగన్ చుట్టూ కోటరీ అంటూ తీవ్ర విమర్శలే చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అయితే ఇసుక, మద్యం విధానాలే ఓటమికి కారణమని గతంలోనే చెప్పారు. ఇప్పటికీ తమ పార్టీ మారలేదని అప్పట్లో సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి, చంద్రబాబు అరెస్టు, చంద్రబాబు భార్య భువనేశ్వరిపై మాటల దాడిని గుర్తు చేసిన కేతిరెడ్డి..వైసీపీ ఓటమికి ఇవే కారణాలుగా చెప్పారు. షర్మిల కూడా జగన్ ఓటమికి ప్రధాన కారణమని కూడా కేతిరెడ్డి అన్నారు. మీ ఫ్యామిలీలో ఆస్తి గొడవలు ఉంటే కోర్టుకెళ్లి పరిష్కరించుకోవాలి కానీ..వైఎస్‌ఆర్ ఫ్యామిలీని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దంటూ వైఎస్ బ్రాండ్‌ను ఎత్తిచూపారు కేతిరెడ్డి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కూడా కేతిరెడ్డి పలుసార్లు ప్రస్తావించారు.
ఇక మాజీమంత్రి పేర్నినాని కూడా తమ హయాంలో సీఎంవోను నడిపించాల్సిన విధంగా నడిపించలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు..కొన్ని తప్పులు చేశాం అందుకే ఓడాం..సరిదిద్దుకుని తిరిగి అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు.
సొంత పార్టీ పని తీరు, జగన్ చుట్టున్న నేతల గురించి మాట్లాడుతున్నది ఎవరో కాదు..జగన్‌కు అత్యంత సన్నిహితులు. పైగా మరో పార్టీ వైపు వెళ్లాలనే ఆలోచన కానీ..ఆప్షన్ కానీ లేని లీడర్లు. అలాంటప్పుడు ఆ నేతల మాటల్లో అసంతృప్తి కంటే..పార్టీ, అధినేత బాగుండాలన్న కోరికే బలంగా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. వీళ్లందరి సూచనలను జగన్ పరిగణలోకి తీసుకుంటే..తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ఉపయోగపడుతాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఓడినా..గెలిచినా జగన్ వెంటే నడిచే నేతలే..లోటు పాట్లను ఎత్తిచూపుతున్నప్పడు..మార్పులు, చేర్పులు చేసుకుంటే..కూటమిని ఢీకొనేందుకు వైసీపీకి పెద్ద కష్టమేమి కాదన్న ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి. మరి మేకపాటి కామెంట్స్ మీద వైసీపీ అధినేత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో కొత్త పథకం వచ్చేస్తోంది.. వారందరికీ పండగే..