grama volunteer brutal murder: అనంతపురం జిల్లా కూడేరు మండలంలో దారుణం జరిగింది. శివరాంపేట గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శ్రీకాంత్‌ను దుండగులు హతమార్చారు. పొలం దగ్గర నిద్రలో ఉండగా ఈ ఘోరం జరిగింది. ఉదయం అటుగా వెళ్తున్న కొందరు శ్రీకాంత్ మృతదేహాన్ని చూసి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శ్రీకాంత్ ను విగతజీవిగా చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు.
అర్ధరాత్రి సమయంలో గునపంతో పొడిచి వాలంటీర్ ను హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. శ్రీకాంత్ తండ్రిని చంపబోయి అతని కుమారుడిపై దాడి జరిగిందని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.