గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి.. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు..

బాపట్ల జిల్లాలోని ఓ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బండరాళ్లు పడటంతో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.

Granite Quarry

Granite Quarry Accident at Bapatla Dist: ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బల్లికురవ సమీపంలోని సత్యక్రిష్ణ గ్రానైట్ క్వారీలో డ్రిల్లింగ్ వేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బండరాళ్లు విరిగి పడటంతో ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో 16మంది కార్మికులు పనిచేస్తున్నారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. పలువురికి కార్మికులకు తీవ్ర గాయాలు కావటంతో.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బండరాళ్ల కింద పడిఉన్న మృతదేహాలను వెలికితీసి అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై బాపట్ల జిల్లా కలెక్టర్‌, ఎస్పీ స్థానిక అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేశారు. మృతులు ఒడిశా వాసులుగా ప్రాథమికంగా గుర్తించారు.

క్వారీ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని ఆదేశించారు.

గ్రానైట్ క్వారీలో ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. క్వారీలో బండరాళ్లు పడి పలువురు కార్మికులు దుర్మరణం పాలవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రమాదంలో రోజువారీ కూలీలు మృతిచెందడం బాధాకరం. గాయపడిన వారికి అవసరమైన వైద్య సాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. బాధి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు.