Green Ammonia Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ప్రపంచం మొత్తం కాకినాడ వైపు చూస్తుందన్నారు. మన సంస్కృతిని కాపాడుకుంటూనే టెక్నాలజీని వాడుకోవాలన్నారు. గ్రీన్ అమోనియా భవిష్యత్తులో పెను మార్పునకు నాంది పలుకుతుందన్నారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ లో 20 పోర్టులు వస్తున్నాయని చెప్పారు. గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఏపీ అనుకూలం అని తెలిపారు. 2027 నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని తెలిపారు. కాకినాడ నుంచి విదేశాలకు గ్రీన్ అమోనియా సరఫరా అవుతుందన్నారు. గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏపీకి గేమ్ చేంజర్ కానుందన్నారు చంద్రబాబు.
ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ను ఏఎం గ్రీన్ సంస్థ కాకినాడలో ఏర్పాటు చేస్తోంది. గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. 13వేల కోట్ల రూపాయలతో 495 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే ఏటా 1,950 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ను ఉత్పత్తి చేయనుంది ఏఎం గ్రీన్ సంస్థ. జర్మనీ, జపాన్, సింగపూర్ కు గ్రీన్ అమోనియాను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 2వేల 600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Also Read: నాకు 5వేలు వచ్చాయి.. మీరు ఇలా చేయండి అంటూ.. మీ ఫోన్‌కు లింక్ వచ్చిందా..? అయితే, జాగ్రత్త..
గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి బాగా పెంచాలని ప్రధాని మోదీ కోరుతున్నారని చంద్రబాబు తెలిపారు. 2014లోనే తమ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి నాంది పలికిందని గుర్తు చేశారు. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియాకు నాంది పలికామన్నారు. కాకినాడలో ఏర్పాటయ్యేది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ అని తెలిపారు. బొగ్గు వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతింటోందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాలుష్యం వల్ల సముద్రంలోనూ పెను మార్పులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, 20 పోర్టులు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు.
నాడు ఎన్టీఆర్ చొరవతో కాకినాడకు నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ వచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఇలాంటి పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులన్నీ ఇక్కడున్నాయన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తయారవుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.