Gudivada Amarnath
విశాఖ వైసీపీ నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరడంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. వంశీకృష్ణ తమ పార్టీని వదిలి వెళ్లడం ఆత్మహత్య సదృశ్యమేనని చెప్పారు. వైసీపీలో ఆయనకు పదవులు ఇచ్చి గౌరవించామని అన్నారు.
సీఎం జగన్ ఏ అన్యాయం చేయలేదని వంశీయే చెప్పారని గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని సస్పెండ్ చేశామని చెప్పారు. వైసీపీలో సీట్లు ఇవ్వడం లేదని కొందరు అంటున్నారని తెలిపారు. ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు నష్టం లేదని చెప్పారు.
భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, నేతలు కేఏ పాల్ పార్టీలోనూ చేరవచ్చని గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఆయా పార్టీల్లో నేతలు చేరితే తమకేమీ సంబంధం లేదని చెప్పారు. వైసీపీలో ఎవరైనా చేరితేనే తమకు సంబంధం ఉంటుందని వ్యాఖ్యానించారు.
ప్రతి పక్షాల నేతలు ఆలోచించి మాట్లాడాలని గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. వైసీపీలో సీట్లు ఇస్తేనే పని చేస్తామని అనేవారు ఎవరైనా ఉంటే అటువంటి వారు వెళ్లిపోవచ్చని అన్నారు. వైసీపీ మేలు కోరే జగన్ పలు స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారని తెలిపారు.