Rishiteshwari Case : తెలంగాణకు చెందిన రిషితేశ్వరి కేసు.. 9ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించిన గుంటూరు కోర్టు..

వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జూలై 14న ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్ లో మృతి చెందింది.

Rishiteshwari Case : ఏపీలో సంచలనం రేపిన రిషితేశ్వరి కేసులో నిందితులకు ఊరట లభించింది. రిషితేశ్వరి కేసును గుంటూరు కోర్టు కొట్టివేసింది. 2015లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి బలవన్మరణానికి పాల్పడింది. ర్యాగింగ్ కారణం అని తల్లిదండ్రులు ఆరోపించారు. 9 ఏళ్ల తర్వాత ఈ కేసును కొట్టివేస్తూ గుంటూరు కోర్టు తీర్పు వెలువరించింది.

రిషితేశ్వరి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జూలై 14న ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్ లో ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్, వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ రిషితేశ్వరి తల్లిదండ్రులు న్యాయ పోరాటానికి దిగారు. 9 ఏళ్లు న్యాయం కోసం పోరాటం చేశారు. తాజాగా కేసును గుంటూరు కోర్టు కొట్టివేయడంతో రిషితేశ్వరి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు.

ఈ కేసులో శుక్రవారం గుంటూరు కోర్టు తీర్పు ఇచ్చింది. సాక్ష్యాధారాలు లేనందున కేసు కొట్టివేస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది. 2015లో రిషితేశ్వరి అనుమానాస్పదంగా మృతి చెందింది. ర్యాగింగే తన ఆత్మహత్యకు కారణమని, సీనియర్ విద్యార్థుల వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ లెటర్ లో పేర్కొంది. అప్పట్లో ఈ కేసు తీవ్ర సంచలనం రేపింది. గుంటూరు కోర్టులో 9ఏళ్ల పాటు ఈ కేసుపై విచారణ జరిగింది. చివరికి ప్రాస్యికూషన్ నేరం నిరూపించలేకపోవడంతో గుంటూరు కోర్టు ఈ కేసును కొట్టివేసింది.

ఈ తీర్పుపై రిషితేశ్వరి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో 170 మంది సాక్ష్యులు ఉన్నారని, తమ కూతురు రాసిన లేఖ కూడా ఉందని వారు తెలిపారు. వాటిని సాక్ష్యాలుగా ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదని వారు వాపోయారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలుస్తామని రిషితేశ్వరి తల్లిదండ్రులు తెలిపారు. కోర్టులకు వెళ్లే ఆర్థికస్థోమత తమకు లేదని, ప్రభుత్వమే తమకు సాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.

కోర్టు తీర్పు తర్వాత రిషితేశ్వరి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. కోర్టు ఆవరణలోనే రిషితేశ్వరి తల్లి బోరున విలపించారు. న్యాయం జరుగుతుందని అనుకున్నాం, ఇక ఓపిక లేదు అంటూ కంటతడి పెట్టారామె. తొమ్మిదేళ్లుగా న్యాయం కోసం ఎదురు చూశాము, ఇక ఓపిక లేదని వారు వాపోయారు. తమ కూతురిని ప్రెషర్స్ పార్టీలో సీనియర్లు లైంగికంగా వేధించారని, ఆ విషయం ప్రిన్సిపల్ కు చెప్పినా పట్టించుకోలేదని రిషితేశ్వరి తల్లిదండ్రులు చెప్పారు. నిందితుల పేర్లు డైరీలో ఉన్నాయని, ఆ డైరీని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో తెలియడం లేదన్నారు.

Also Read : భవిష్యత్తులో రాజధానిని మార్చే అవకాశం లేకుండా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!