Guntur District News Tragedy Elderly Couple Burnt Alive In Hut Fire
Guntur District news: గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం పాంచాలవరంలో విషాద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులు నివాసముండే పూరింటికి నిప్పు అంటుకోవడంతో అందులో నుండి తప్పించుకోలేక ఇద్దరూ సజీవ దహనమయ్యారు. వృద్ధ దంపతులు మంటల్లో చిక్కుకుని మరణించటం విషాదం నింపింది. అమర్తలూరు మండలం పాంచాలపురం గ్రామంలో గున్న లక్ష్మయ్య, భాగ్యమ్మ పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో వారి ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పూరి గుడిసె కావటంతో మంటలు వ్యాపించడానికి పెద్ద సమయమేమీ పట్టలేదు. పొగ, మంటలతో ఇంట్లో నుండి బయటకి రాలేని దంపతులిద్దరూ మంటల్లో చిక్కుకుపోయారు. భాగ్యమ్మ అనారోగ్యంతో ఉండటంతో కొద్దికాలంగా మంచానికే పరిమితమైనట్లు స్థానికులు తెలిపగా.. మంటలు చెలరేగిన సమయంలో లక్ష్మయ్య కూడా ఇంట్లో పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. ముందుగా మంటలు చెలరేగినట్లు గమనించిన చుట్టుపక్కల వారు మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేక ఇద్దరూ సజీవ దహనమయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తుండగా దంపతుల దహనం వార్తతో స్థానికంగా విషాద ఛాయలు అలుకుమున్నాయి.