Case On YS Jagan : ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ పై కేసు నమోదైంది. ఆయనతో సహా మరో 8మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డులో కార్యక్రమం నిర్వహించిన వారిపై కేసు పెట్టారు.
నిబంధనలకు విరుద్ధంగా పర్యటించిన జగన్ తో పాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లితో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటన కారణంగా మిర్చి యార్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు వాహనాలు నిలిపివేయడంతో రైతులు అవస్థలు పడ్డారు.
Also Read : చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి.. మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..
మిర్చి యార్డులోకి సరుకు తెచ్చే వాహనాలతో పాటు పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మిర్చి లోడ్ లారీలు, వ్యాన్ లు రోడ్లపైనే నిలిచిపోయాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బుధవారం జగన్ గుంటూరు మిర్చికి వెళ్లారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మిర్చికి గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు జగన్. రైతులు కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని వాపోయారు.
జగన్ విమర్శలకు అధికార టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఎదురు దాడికి దిగారు. రైతుల నష్టపోకుండా ఆదుకుంటున్నామన్నారు. తన పాలనలో దారుణాలు చేసిన జగన్ ఇవాళ రైతుల కోసం గగ్గోలు పెడితే ఎవరూ నమ్మరని ధ్వజమెత్తారు. గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో మిర్చి పంటకు 7వేల రూపాయలు మద్దతు ధరగా జీవో ఇచ్చిన విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. మొత్తంగా మిర్చి ధరల పతనం రాజకీయ రంగు పులుముకున్నట్లైంది.