AP DGP Harish Kumar Gupta
AP DGP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఏపీ డీజీపీ హరీష్ గుప్తాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు ఆయన జీవోను విడుదల చేశారు. 1992కు చెందిన హరీష్ కుమార్ గుప్తాకు ఏపీ డిజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవానికి, కొత్త డీజీపీ ఎంపిక రెండు వారాల క్రితమే ఖరారు అయింది.
నెలాఖరులో ద్వారాకా తిరుమల రావు పదవీ విరమణ :
ఈ నెలాఖర్లో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉందోనని ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఏపీ కొత్త డీజీపీగా హరీష్ గుప్తాను ఎంపిక చేస్తూ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.
ప్రస్తుతం ఈయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్నారు. ప్రస్తుత డీజీపీ కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన చేయకపోవడంతో కొత్త డీజీపీ ఎంపిక అనివార్యమైంది.
డీజీపీ రేసులో గుప్తాకు చోటు :
ఏపీ డీజీపీ రేసులో హరీష్ కుమార్ గుప్తాకు చోటు దక్కింది. తీవ్ర పోటీ ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు గుప్తావైపు మొగ్గు చూపారు. హరీష్ కుమార్ గుప్తాను గత మే నెలలో డీజీపీగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సంగతి తెలిసిందే.
రాజకీయ ఆరోపణల కారణంగా రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసింది. ఆయన స్థానంలో హరీష్‌ను ఈసీ ఎంపిక చేసింది. సీనియార్టీ పరంగా హరీశ్ కుమార్ గుప్తా, ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లను ఎన్నికల సంఘానికి ఏపీ సీఎస్ సూచించారు.
అయితే సీనియర్ ఐపీఎస్ అధికారి 1992 బ్యాచ్ అయిన హరీశ్ కుమార్ గుప్తా పేరును డీజీపీగా ఈసీ ఎంపిక చేసింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ఏపీ క్యాడర్‌కు ఎంపిక అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల మధ్య అనూహ్యంగా జూన్ 21వ తేదీన ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావును ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది.