Heavy Rains
AP Heavy Rains : భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా ఇటీవల కుండపోత వర్షం కారణంగా విజయవాడ, గుంటూరుసహా పలు జిల్లాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికితోడు ఎగువ ప్రాంతాల్లో మున్నేరు ఉప్పొంగడంతో బుడమేరులోకి భారీగా వరదనీరుచేరి విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. గత ఐదు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు ఉన్నాయి. బుడమేర ఉధృతి తగ్గడంతో ఇప్పుడిప్పుడే వరద ముంపు నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. ఈ క్రమంలో మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే, ప్రస్తుతం ఏపీకి వాయుగుండం ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా పరిసరాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Also Read : Tollywood : తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం.. భారీ విరాళాలు ఇస్తున్న టాలీవుడ్ యూనియన్లు..
రాబోయే రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు వాయుగుండం చేరువగా వెళ్లే అవకాశం ఉంది. వాయుగుండం కారణంగా రాజస్థాన్ రాష్ట్రంలోని సూరత్ గఢ్, హరియాణా రాష్ట్రంలోని రోహ్ తక్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మండ్ల మీదుగా అల్పపీడనం కేంద్రం వరకు, అక్కడి నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన శ్రేణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also Read : Vijayawada Floods : వరదలో కూరుకుపోయిన బైకులు..మెకానిక్ షాపులకు ఫుల్ డిమాండ్
ఇవాళ (శుక్రవారం).. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు గరిష్ఠంగా 55కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే మూడురోజులు సముద్రం అలజడిగా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.