ఏపీకి భారీ వర్ష సూచన : నాలుగు జిల్లాలకు వర్షం ముంపు

  • Publish Date - October 19, 2020 / 07:38 AM IST

Heavy rain forecast for AP : ఏపీని వరుణుడు వణికిస్తున్నాడు. మరో రెండు రోజులు ప్రతాపం చూపనున్నాడు. దీంతో 2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం, 20వ తేదీ మంగళవారం రోజుల్లో వర్షాలు దంచి కొట్టనున్నాయి. ఈ మేరకు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.



తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నందున… రాగల రెండు రోజులు….రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో వానలు పడతాయని తెలిపింది.

ఏపీలో నాలుగు జిల్లాలకు వర్షం ముంపు పొంచి ఉంది. ప్రధానంగా దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతోపాటు.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల పడే చాన్స్‌ ఉంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తాంధ్రలో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయి.



మంగళవారం భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే చాన్స్‌ ఉంది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా అక్కడక్కడ పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమకూ వర్షంగండం పొంచి ఉంది. సోమ, మంగళవారం రోజులో సీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్లు కురిసే అవకాశముంది. భారీ వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే సీమలో పలుచోట్ల వానలు దంచి కొడుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.

ట్రెండింగ్ వార్తలు