భారీ వర్షాలకు సముద్రంలో అల్లకల్లోలం.. స్కూల్స్‌కు సెలవు ప్రకటించిన కలెక్టర్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

heavy rains badly hit east godavri district schools holiday in visakha district

Heavy Rains in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మీటర్ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్ర తీరం వెంబడి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 9 మండలాల్లో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు.

గుబ్బల మంగమ్మ అమ్మవారి దర్శనం రద్దు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అమ్మవారిని దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. వర్షం పూర్తిగా తగ్గేవరకు దర్శనానికి రావొద్దని భక్తులను పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

విశాఖ జిల్లాలో స్కూల్స్ కు సెలవు
విశాఖపట్నం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ స్కూల్స్‌కు సెలవు ప్రకటించారు.

పాపికొండల్లో టూరిజం బోట్ల నిలిపివేత
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో రాజమండ్రిలోని కంబాల చెరువు ఇన్నిసు పేట, విఎల్ పురం ప్రాంతాలు జలమయ్యాయి. ఏజెన్సీలోని చింతూరు, కూనవరం, వీఆర్పురం మండలంలో సుమారు 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం గండి పోచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. వరద ప్రభావం కారణంగా పాపికొండల టూరిజం బోట్లను అధికారులు నిలిపివేశారు. కోనసీమ ప్రాంతంలో పీ గన్నవరం నియోజవర్గం గంటి పెద్దపూడి వద్ద తాత్కాలికంగా వేసిన రోడ్డు వరద ప్రభావంతో కొట్టి పోవడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Also Read: భారీ వర్షాలతో గోదావరి జిల్లాలు అతలాకుతలం.. వాగులో కొట్టుకుపోయి కారు

ధవలేశ్వరంలో పెరుగుతున్న నీటిమట్టం 
ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10.60 అడుగులకు చేరుకుంది. ఇరిగేషన్ అధికారులు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి ఎప్పటికప్పుడు నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. ప్రతిరోజు సుమారుగా లక్ష క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నట్టు సమాచారం. భద్రాచలం వద్ద నీటిమట్టం తగ్గినప్పటికీ ఇక్కడ మాత్రం నీటిమట్టం పెరుగుతోందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ‌

ట్రెండింగ్ వార్తలు