Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..

కుండపోత వర్షాల కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు.

Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి రెండవ ఘాట్ రోడ్ లోని హరిణికి సమీపంలో బండరాళ్లు జారిపడ్డాయి. వెంటనే టీటీడీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. వాహనదారులకు, ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు బండరాళ్లను తొలగిస్తున్నారు. బండరాళ్లు జారిపడుతుండటంతో.. ఘాట్ రోడ్ లో జాగ్రత్తగా ప్రయాణించాలని వాహనదారులకు టీటీడీ అధికారులు సూచించారు. అటు కుండపోత వర్షాల కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. గోగర్భం, పాపవినాశనం పూర్తిగా వర్షం నీటితో నిండిపోయాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీనికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. రైల్వేకోడూరులో రాత్రి నుంచి ముసురు పట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఓవైపు చలి, మరోవైపు కుండపోత వానలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తుపాను కారణంగా వానలు పడుతుండగా.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. అటు రైతులను కూడా అలర్ట్ చేశారు అధికారులు. పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. చెన్నైతో సహా 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

Also Read : ఒకేరోజు వైసీపీకి డబుల్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..