Grandhi Srinivas : ఒకేరోజు వైసీపీకి డబుల్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..
గ్రంధి శ్రీనివాస్ భవిష్యత్తు కార్యచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఆయన ఏ పార్టీలో చేరనున్నారు? అనేది ప్రకటించకపోయినా..

Grandhi Srinivas : వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపించారు. గ్రంధి శ్రీనివాస్ తో పాటు మరికొందరు కూడా వైసీపీకి రిజైన్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చెందాక ఆయన పార్టీ ప్రత్యక్ష కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో పలువురు మాజీ మంత్రులు పలు దఫాలుగా గ్రంధి శ్రీనివాస్ తో భేటీ అయ్యారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. గ్రంధి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నెగ్గినా.. పార్టీలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదని గ్రంధి శ్రీనివాస్, ఆయన అనుచరులు, అభిమానులు పార్టీపై కొంత ఆగ్రహంగా ఉన్నారు. 2024 ఎన్నికల వరకు కూడా పార్టీకి సంబంధించి గోదావరి జిల్లాల్లో గ్రంధి శ్రీనివాస్ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశారు.
గతంలో జగన్ కూడా ఆయనను ప్రశంసించారు. అయినప్పటికీ పార్టీలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదని గ్రంధి శ్రీనివాస్ తో పాటు ఆయన అనుచరులు కూడా అలకబూనారు. పార్టీ రకరకాలుగా చర్చలు జరిపినా గ్రంధి శ్రీనివాస్ వెనక్కి తగ్గలేదు. వైసీపీకి ఆయన రాజీనామా చేస్తారని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరికి అదే జరిగింది. వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు గ్రంధి శ్రీనివాస్ ప్రకటించారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించారు. పార్టీ సభ్యత్వానికి, భీమవరం నియోజకవర్గ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు జగన్ కు లేఖ పంపారు గ్రంధి శ్రీనివాస్.
గోదావరి జిల్లాలకు చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గ్రంధి శ్రీనివాస్ భవిష్యత్తు కార్యచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఆయన ఏ పార్టీలో చేరనున్నారు? అనేది ప్రకటించకపోయినా.. ఇప్పటికే ఆయనకు ఇతర పార్టీల నుంచి ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రంధి శ్రీనివాస్ తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అటు తర్వాత వైసీపీకి వెళ్లారు. ఇప్పుడు మాత్రం పార్టీ చేరిక విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని గ్రంధి శ్రీనివాస్ యోచిస్తున్నారు.
Also Read : వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. జగన్‌పై ఫైర్