Avanthi Srinivas: వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. జగన్‌పై ఫైర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు.

Avanti Srinivas
Avanthi Srinivas: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధిష్టానం నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజాతీర్పును గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. కొత్త ఏర్పడిన ప్రభుత్వానికి సంవత్సరం సమయం ఇవ్వాలని, అలాకాకుండానే ఆర్నెళ్లు కాకముందే వైసీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు. ఐదేళ్లు వైసీపీ కోసం నాయకులు, కార్యకర్తలు కష్టపడ్డారు. కానీ, వారు ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయారు. మళ్లీ అధికారం కోల్పోయిన ఆరు నెలలకే రోడ్లపైకి రావాలంటూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలంటూ జగన్ మోహన్ రెడ్డి పిలుపునివ్వటాన్ని అవంతి తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలు, నాయకులను జగన్ నిర్ణయాలు మరింత కష్టాల్లోకి నెట్టేవిలా ఉన్నాయని అవంతి అన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిల అభిప్రాయాలు తీసుకొని జగన్ పార్టీ కార్యక్రమాలను రూపొందించాలని, అలాకాకుండా ఏకపక్ష నిర్ణయాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అవంతి సూచించారు. అయితే, అవంతి ఏ పార్టీలో చేరతారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు.
Also Read: Mohan Babu: సినీనటుడు మోహన్ బాబుకు మరో బిగ్ షాకిచ్చిన పోలీసులు..
వైసీపీ అధికారం కోల్పోయిన నాటినుంచి ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేయగా.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు పలువురు జగన్ మోహన్ రెడ్డికి బైబై చెప్పారు. మరోవైపు భారీ సంఖ్యలో పలు జిల్లాల జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు వైసీపీని వీడారు. తాజాగా అవంతి శ్రీనివాస్ సైతం పార్టీని వీడటంతో వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క కూటమి ప్రభుత్వంపై పోరుబాటకు జగన్ పిలుపునివ్వగా.. మరోవైపు ఆ పార్టీని కీలక నేతలు వీడుతుండటం గమనార్హం. ఇదిలాఉంటే.. అవంతి శ్రీనివాస్ వైసీపీని వీడటం ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి భారీ ఎదురు దెబ్బేనని చెప్పొచ్చు.
Also Read: Nirmala Sitharaman: వారికి ఫోన్లు చేసి వేధించేవారు.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు
అవంతి శ్రీనివాస్ 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పటి ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో విలీనం చేయడంతో అవంతి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2019లో వైసీపీలో చేరిన అవంతి.. భీమిలి అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కేబినెట్ లో మంత్రిగా రెండున్నరేండ్లు పనిచేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున భీమిలి నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ పై ఓడిపోయారు. ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత అవంతి ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.