AP Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు దంచికొట్టనున్న వానలు.. పిడుగుల హెచ్చరికలు జారీ..
AP Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే, తాజాగా వాతావరణ శాఖ వర్షాలపై మరో కీలక విషయాన్ని వెల్లడించింది.
- Harish Thanniru
- Published on- August 29, 2026 / 07:13 AM IST
AP Rain Updates
AP Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే, తాజాగా వాతావరణ శాఖ వర్షాలపై మరో కీలక విషయాన్ని వెల్లడించింది. ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపటికి వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
వర్షాలకుతోడు ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగులు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనులు, పంట సంరక్షణ విషయంలో వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఏపీలో ఎల్‌నినో ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు పడుతున్నా.. చెరువులు, కుంటల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. దీనికితోడు సరియైన వర్షాలు పడకపోవటంతో రైతులు పంటల సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో సాగుచేసిన పంటలకు నీరు అందక ఎండిపోతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో రైతులు ఇప్పటి వరకు సాగు పనుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నం కాలేదు. అయితే, ఏపీ ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
