Rains In Andhra Pradesh : ఏపీలోనూ దంచికొడుతున్న వర్షాలు

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలల్లో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.   

Heavy Rains In Andhra Pradesh  :  ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలల్లో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.   ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తా ఆంధ్రలో ముసురు వాతావరణం నెలకొంది.  పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతోపాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

శనివారం ఉత్తర, దక్షిణ కోస్తాలోని తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. రాయలసీమలోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కోనసీమను తాకిన వరద
రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు పలు లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద కొనసీమను తాకింది. తూర్పుగోదావరి జిల్లా  పి.గన్నవరం మండలం గంటిపెదపూడి లంకలో తాత్కాలిక నదీపాయ గట్టు తెగింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పి. గన్నవరం మండలం బూరుగులంక, ఉడుముడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారి పేటకు చెందిన గ్రామాల ప్రజలు నాలుగు నెలల పాటు పడవపైనే ప్రయాణాలు చేయనున్నారు.

వర్షాకాలం వస్తొందని తెలిసినా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదని ఆరోపణలువినిపిస్తున్నాయి.మరింత వరద పెరిగితే కోనసీమలోని కనకాయలంక, అయినవిల్లి ఎదురు బిడియం కాజ్ వేల పైకి చేరనున్న వరద నీరు చేరే అవకాశం ఉందని గ్రామస్తులు భయపడుతున్నారు. కాగా ఇప్పటివరకు అధికారులు వరదలపై ఎలాంటి సమీక్ష సమావేశం నిర్వహించ లేదని తెలుస్తోంది. ధవళేశ్వరం బ్యారేజిలోకి భారీగా వరద నీరువచ్చి చేరుతుండటంతో ఈరోజు 1,20,000 క్యూసెక్కుల నీటికి సముద్రంలోకి వదిలారు. వశిష్ట వైనితేయ గోదావరి నదిపాయల్లోకి వరదనీరు చేరింది.
Also Read :Telangana Rains : ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్-వచ్చే నాలుగు రోజుల్లో అతి భారీ వర్షాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా లోని ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం డివిజన్లోని ఏడు మండలాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు అస్తవ్యస్తంగా మారాయి.వాగులు.. వంకలు పొంగిపొర్లుతున్నాయి. భూపతిపాలెం,ముసురుమిల్లి రిజర్వాయర్ లు నిండు కుండను తలపిస్తున్నాయి. మరోపక్క, పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి పెరగడంతో ముంపు గ్రామాల మొత్తం జలమయం అయ్యాయి. దేవీపట్నం మండలం పోచమ్మగండి అమ్మవారి ఆలయాన్ని గోదావరి వరదనీరు ముంచెత్తింది.

ప్రకాశం బ్యారేజికి పెరుగుతున్నవరద నీరు
మరోవైపు కృష్ణా, గుంటూరు జిల్లాలలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ కు క్రమేపి వరద ప్రవాహం పెరుగుతోంది. మున్నేరు నుంచి 25 వేల క్యూసెక్యుల నీరు కృష్ణాలో చేరుతోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రకాశం బ్యారేజ్‌ ఎనిమిది గేట్లు అడుగు మేర ఎత్తి 8,000 క్యూసెక్యుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. త్రాగు, సాగు నీటి అవసరాల కోసం కృష్ణా, ఈస్ట్రన్‌ అండ్‌ వెస్ట్రన్‌ కాలువలకు 4,500 క్యూసెక్యుల నీటి విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు వెల్లడించారు.

విజయనగరం  జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కురిసిన వర్షానికి బొబ్బిలి మండలంలో వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నిండు కుండలను తలపిస్తోన్నాయి తెర్లం వద్ద రోడ్డు పై నుంచి వరద నీరు ప్రవహించడంతో బొబ్బిలి-రాజాం రహదారిలో రాకపోకలు స్తంభించాయి. నందిగం గ్రామంలో వరదనీరు వీదుల్లో ప్రవహిస్తోంది.

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప- తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగుపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మండల కేంద్రం నుండి విజయవాడ,నూజివీడుకు వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు  20 గ్రామాలకు రాకపోకలు బంద్ కావడంతో వాహన దారులు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేసారు.

ట్రెండింగ్ వార్తలు