ఏపీలో రెండురోజులు భారీ వర్షాలు

  • Publish Date - August 16, 2020 / 08:29 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి శ్రీకాంత్‌ పేర్కొన్నారు.



కృష్ణా జిల్లాతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.



తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతి క్రమం పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 14,63,902 క్యూసెక్కులుగా నమోదు అయింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం తూర్పుగోదావరిలో రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం.. పశ్చిమ గోదావరిలో రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. లోతట్టు ప్రాంత, లంక గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

కృష్ణా జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని మున్నేరు, వైరా, కట్టలేరు, కూచివాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదస్థాయిలో కాజ్‌వేలపై నీరు ప్రవహిస్తోంది. పంట పొలాలు నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. నీటి ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. ఇన్ ఫ్లో 1,20,000 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 1,12,000 క్యూసెక్కులుగా నమోదయ్యింది. 70 గేట్లను ఎత్తివేసి నీటిని వదులుతున్నారు. ఈ రాత్రికి 1,50,000 క్యూసెక్కుల వరద రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.



అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. లంక గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్.. అధి​కారులను ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధమవుతున్నాయి.