AP Rains
AP Rain Alert: ఏపీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, రానున్న వారంరోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి రానున్న 48గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. కేరళతోపాటు గోవాలో పూర్తిగా విస్తరించాయి. కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రెండు రోజుల్లో ఏపీ, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఇవాళ లేదా రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి గురువారం నాటికి బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ కారణంగా ఈనెల 29వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాక.. ఉరుములతో కూడిన గాలులు గరిష్ఠంగా గంటకు 70కిలో మీటర్లు వేగంతో వీస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది.
ఇప్పటికే ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనంకు తోడు.. రుతుపవనాలు ఏపీలోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.