Hereditary land registration : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు తీపికబురు చెప్పింది. కేవలం రూ. 100 చెల్లిస్తే చాలు.. ఆ భూములు మీ పేరుపై రిజిస్ట్రేషన్ అయిపోతాయి.
Also Read : Pawan Kalyan : ఏపీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..
రాష్ట్రంలో వారసత్వ వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం సులభతరం చేసింది. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే భూముల విషయంలో ఇబ్బందులు ఉండేవి.. గతంలో వారసులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని.. కేవలం కాగితాలపై రాసుకునేవారు. కానీ, ఈ మ్యూటేషన్లు (యాజమాన్య మార్పులు) సకాలంలో జరగడం లేదు. దీంతో వాసత్వ భూమిని పొందడానికి దరఖాస్తు దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
ఈనెల 9వ తేదీ నుంచి కొత్త విధానం ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. ఒకవేళ వీలునామా రాయకుండా తల్లిదండ్రులు చనిపోతే.. వారి వారసులు ఆ ఆస్తుల్ని పంచుకుని, లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయానికి వస్తే సరిపోతుంది. అలాంటి వారికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ. 100 లేదా రూ. వెయ్యికే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.
ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.10లక్షల లోపు ఉంటే రూ.100 చొప్పున చెల్లించాలి. ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.10లక్షలు మించితే రూ.వెయ్యి నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు ఊరట లభించింది.