రాజధానిపై ఏపీ సర్కార్ ఈ నెలాఖరులోగా తేల్చేస్తుందా… అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండో సమావేశం తర్వాత హైపవర్ కమిటి ఇచ్చిన ప్రతిపాదనలపై కసరత్తు చేస్తోంది. మరోవైపు… 2020, జనవరి 13వ తేదీ సోమవారం హైపవర్ కమిటి మరోసారి సమావేశం కానుంది. ఏం సూచనలు చేయబోతోంది. ఏ ఏ అంశాలపై హైపవర్ కమిటి దృష్టిపెట్టబోతోందనే విషయం ఆసక్తి రేపుతోంది.
ఏపీలో రాజధాని మార్పు అంశం ఓ రేంజ్‌లో పొలిటికల్ హీట్ పెంచేసింది. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఆందోళనలు ఉధృతమవుతుంటే… పాలన వికేంద్రీకరణ వల్ల కలిగే లాభాలను చెప్పే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. GN RAO కమిటి, బీసీజీ నివేదికలు వికేంద్రీకరణకే మొగ్గుచూపాయి. మూడు రాజధానులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీతో పాటు బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికలను హైపవర్ కమిటీ ఆధ్యయనం చేస్తోంది. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఏర్పాటైన హైపవర్ కమిటి ఇప్పటికే ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. రెండు సార్లు భేటీ అయిన హైపవర్ కమిటీ మరోసారి సమావేశం కానుంది.
గత సమావేశాల్లో.. పరిపాలనే కాదు..అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలన్న అంశంపై హైపవర్ కమిటి దృష్టిపెట్టింది. బీసీజీ, జీఎన్ రావు కమిటీ నివేదికలే కాకుండా అన్ని అంశాలపై క్షుణ్ణంగా చర్చించింది. కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే కాకుండా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని కమిటీ భావించింది. దానికి సంబంధించి ప్రభుత్వం ముందు పలు ప్రతిపాదనలు పెట్టింది. ఇక సోమవారం నాడు జరిగే సమావేశంలో ఉద్యోగుల తరలింపుపై ప్రభుత్వానికి తగిన సూచనలిచ్చే అవకాశం కనిపిస్తోంది. రెండు సమావేశాల్లో రాజధాని రైతుల ప్రయోజనాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసినా… ఈసారి మాత్రం ఉద్యోగులు, వారి సాదకబాధకాలవైపు దృష్టిపెట్టనుంది. అలాగే… సోమవారం నాడు జరిగే సమావేశంలో రైతులు, ఉద్యోగులతోపాటు భాగస్వామ్య పక్షాల అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది.
రైతులు, ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని… వాటిపై చర్చించిన అనంతరం… ఈనెల 17వ తేదీనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే విషయంపై హైపవర్ కమిటి దృష్టిపెట్టింది. ఆ మరుసటి రోజే అంటే 18వ తేదీనే మంత్రివర్గ సమావేశంలో హైపవర్ కమిటి నివేదికపై చర్చ జరుగనుంది. దీంతో.. కమిటి సభ్యులు అన్ని విషయాలపై ఫోకస్ చేస్తున్నారు. 18న జరిగే మంత్రివర్గ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదముద్ర వేయటంతో పాటు 20న శాసనసభను సమావేశపరచడం ద్వారా తీర్మానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే సెక్రటేరియట్ ఉద్యోగులకు ఇచ్చిన సెలవులను రద్దు చేసింది.
కేవలం 15వ తేదీన మాత్రమే సంక్రాంతి సెలవు ప్రకటించింది. మరోవైపు… 27 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మరింత ఆలస్యం జరిగితే మంచిదికాదని ప్రభుత్వం భావిస్తుండటంతో… సమావేశంలో హైపవర్ కమిటి బీసీజీ, జీఎన్ రావు కమిటీ నివేదికలపై కూలంకుషంగా చర్చించడమే కాకుండా… సర్కారుకు ఇవ్వాల్సిన రిపోర్ట్‌పైన కూడా దృష్టిపెట్టే అవకాశం ఉంది.
Read More : ఏం చర్చించనున్నారు : కేసీఆర్, జగన్ ఏకాంత భేటీ