Ambati Rambabu: గుంటూరులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటిపై దాడి జరిగింది. వాహనాలను ధ్వంసం చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంబటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంబటి ఇంటి ముట్టడికి టీడీపీ శ్రేణులు వెళ్లగా అక్కడికి వైసీపీ శ్రేణులు కూడా చేరుకోవడంతో టెన్షన్ వాతావరణ నెలకొంది. అలర్ట్ అయిన పోలీసులు అంబటి ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసులు నమోదు చేయాలని టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేయగా.. కేసులకు భయపడేది లేదన్నారు అంబటి రాంబాబు.
తన ఇంటిపై దాడి ఘటనపై అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. నా చుట్టూ జరుగుతున్న విమర్శలు అన్నింటికీ సమాధానం చెబుతానని అన్నారు. టీటీడీ లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని రిపోర్ట్ వచ్చిందన్నారు. కానీ మేమే ఏదో చేసినట్టు ఫ్లెక్సీలు కట్టారని, ఆ ఫ్లెక్సీలు తీసేయాలని గౌరవంగా చెప్పానని అన్నారు. ఈరోజు కూడా ఫ్లెక్సీలు చించడానికి వెళ్ళలేదని, వెంకన్న గుడికి పూజలు చేయడానికి వెళ్ళానని వివరించారు.
తాను వెళ్ళే దారిలో తనను అడ్డుకుని బూతులు తిట్టారని, వాళ్ళు తిట్టారు కాబట్టే నేనే తిట్టానని అంబటి రాంబాబు తెలిపారు. నేను చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా తిట్టలేదన్నారు. ఆయనను ప్రజలు ఎన్నుకున్నారు నేనెందుకు తిడతాను అని వ్యాఖ్యానించారు. ఆయనో పెద్ద నాయకుడు అలా తిట్టి ఉండాల్సింది కాదు.. నా మీద దాడి చేశారు కాబట్టే అలా మాట్లాడాను అని చెప్పారు.
”అది అనుకోకుండా జరిగిపోయింది. చంపడానికి వస్తే నేను గావు కేక పెట్టాను అంతే. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి. అరెస్టులను లెక్క చేయను. అరెస్ట్ కు సిద్ధంగా ఉన్నా. రాడ్లు, కర్రలతో దాడి చేస్తుంటే పోలీసులు ఆపగలిగారా? మమ్మల్ని కొట్టడానికి వస్తే వారికి రక్షణ కల్పిస్తారా? మీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్కచేయదు.. నేను పారిపోను.. బెయిల్ కు వెళ్ళను. ఇంతమంది పోలీసులు ఉండి మా పై దాడులు చేసిన వారిని వదిలేసి మమ్మల్నే అరెస్ట్ చేస్తారా?” అని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.
Also Read: చలాన్ పడితే అకౌంట్లో డబ్బులు కట్.. ప్రాసెస్ స్టార్ట్ అయిందా? మీరూ దీన్ని గమనించారా?