Nallamilli Ramakrishna Reddy : పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం.. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికి ఇవ్వకపోతే వైసీపీ గెలుపు ఖాయం అంటున్నారు. కనీసం లక్ష ఓట్ల మెజారిటీతో సత్తి సూర్యనారాయణ రెడ్డి గెలుపు తథ్యం అంటున్నారు టీడీపీ కార్యకర్తలు.

Nallamilli Ramakrishna Reddy : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నల్లమిల్లికి సీటు కేటాయించకపోవడంతో కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన రామకృష్ణారెడ్డి.. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. తాను అధిష్టానంతో మాట్లాడతానని, అప్పటిదాకా వేచి ఉండాలని కోరారు.

నల్లమిల్లికి సీటు ఇవ్వకపోతే రాజీనామాలకు సిద్ధమంటున్నారు టీడీపీ నేతలు. అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికి ఇవ్వకపోతే వైసీపీ గెలుపు ఖాయం అంటున్నారు. కనీసం లక్ష ఓట్ల మెజారిటీతో సత్తి సూర్యనారాయణ రెడ్డి గెలుపు తథ్యం అంటున్నారు టీడీపీ కార్యకర్తలు. రేపు(మార్చి 28) ఉదయం 10 గంటలకు టీడీపీ శ్రేణులు సమావేశం కానున్నాయి. రేపు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడతానని రామకృష్ణారెడ్డి తెలిపారు.

అధిష్టానం నిర్ణయం, కార్యకర్తల అభిప్రాయం నాకు రెండూ సమానమే అంటున్నారు రామకృష్ణారెడ్డి. ఒకసారి మాట్లాడి నా అభిప్రాయాన్ని చెబుతా అంటున్నారాయన. కార్యకర్తలు ఎవరూ తొందరపడొద్దని, మాట్లాడే ప్రయత్నం చేద్దామని రామకృష్ణారెడ్డి అంటున్నారు. కూటమి అధికారంలోకి రావాలంటే ఇక్కడి సీటు కచ్చితంగా రామకృష్ణారెడ్డికే ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. అంతిమ నిర్ణయాన్ని రామకృష్ణారెడ్డికే వదిలేశారు కార్యకర్తలు. కానీ తమ ఉద్యమం కొనసాగుతుందని వారు తేల్చి చెప్పారు.

అనపర్తి అసెంబ్లీ సీటును చంద్రబాబు ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించారు. అయితే, పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. అదే స్థానం నుంచి తన అభ్యర్థిని ప్రకటించింది. అక్కడ శివకృష్ణంరాజు పేరుని అభ్యర్థిగా ఖరారు చేసింది. దీంతో టీడీపీ కార్యకర్తల్లో కోపం కట్టలు తెంచుకుంది. పొత్తులో భాగంగా అనపర్తి సీటుని బీజేపీకి ఇవ్వొద్దని, టీడీపీకే కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికి ఇవ్వాలంటున్నారు. లేదంటే పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Also Read : టీడీపీలో ఆ 10 మంది బడా నేతల భవిష్యత్తు ఏంటి? టికెట్ దక్కకపోవడానికి కారణాలేంటి?

ట్రెండింగ్ వార్తలు