ఏపీ శాసనమండలి చరిత్ర : 16 ఏళ్ల తర్వాత..

  • Publish Date - January 21, 2020 / 01:36 PM IST

ఏపీ శాసనమండలి తెరమీదకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం దీనిని రద్దు చేస్తారనే దానిపై తెగ చర్చ నడుస్తోంది. రెండు బిల్లులను (అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు) గట్టెక్కించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ రూల్ 71ని టీడీపీ ప్రవేశపెట్టడంతో మండలిని రద్దు చేయడమే బెటర్ అని భావిస్తోంది. దీంతో రద్దు అవుతుందా ? లేదా ? అనే దానిపై పొలిటికల్ రంగంలో చర్చ జరుగుతోంది. 

ఏపీ శాసనమండలి విషయానికి వస్తే :- 
1958లో ఆర్టికల్ 168 కింద జులై 01న మండలి ఫస్ట్ టైం ఏర్పాటైంది. అప్పుడు రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. 1958, జులై 08వ తేదీన మండలిని అధికారికంగా ప్రకటించారు.1985లో శానసమండలిలో కాంగ్రెస్‌కు 48 మంది సభ్యులున్నారు. 1985 ఏప్రిల్ 30వ తేదీన మండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసింది ఎన్టీఆర్ ప్రభుత్వం. రాష్ట్ర బడ్జెట్‌పై భారం, చట్టాలు ఆమోదించడంలో డిలే అవడంతో ఎన్టీఆర్ రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1985, జూన్ 01వ తేదీన విధాన పరిషత్ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 

మండలి కోసం 1990 జనవరి 22వ తేదీన అసెంబ్లీలో తీర్మానం చేసింది మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం. తర్వాత ఈ తీర్మానం పార్లమెంట్‌కు చేరుకుంది. 1990, మే 28వ తేదీన ఎగువ సభలో తీర్మానం పాస్ చేశారు. మరలా..1991 సంవత్సరంలో లోక్ సభ రద్దయ్యింది. దీంతో మండలి పునరుద్ధరణకు పెండింగ్‌లో పడిపోయింది. 

2004లో అధికారంలో కాంగ్రెస్ :-
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదే సంవత్సరం జులై 08న శాసనమండలి పునరుద్ధరించాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. యదావిధిగా తీర్మానాన్ని పార్లమెంట్‌కు పంపింది. 2005, డిసెంబర్ 15వ తేదీన ఏపీ శాసనమండలి పునరుద్ధరణకు లోక్ సభ ఆమోదం తెలిపింది. 2005, డిసెంబర్ 20వ తేదీన రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. 2006, జనవరి 10వ తేదీన ఏపీ శాసనమండలి పునరుద్ధరణకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. 2007 మార్చి 30వ తేదీన ఏపీ శాసనమండలి మరలా ఏర్పాటైంది. అప్పటి నుంచి మండలిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 

2019లో అధికారంలో వైసీపీ :-
2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మండలి, శాసనసభా సమావేశాలు జరిగాయి. మూడు రాజధానుల కోసం శాసనసభ, మండలి ప్రత్యేకంగా సమావేశమైంది. 2020, జనవరి 20వ తేదీ సోమవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సభ ఆమోదం పొందింది. మరి మండలి రద్దు అవుతుందా ? లేదా ? అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. 

Read More :శాసన మండలి ఎదుట బిల్లులు..టీడీపీ సభ్యుల ఆందోళన