Home Minister Anitha
Home Minister Anitha : ఏపీ శాసన మండలిలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై వాడి వేడి చర్చ జరిగింది. వైసీపీ సభ్యులు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వారికి హోమంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో పోలిస్తే మా హయాంలో క్రైమ్ రేటు తగ్గిందని, అత్యాంతంర ఘటనలను రాజకీయ చేయొద్దని సూచించారు. నిర్భయ చట్టాన్ని పక్కన పెట్టి గత ప్రభుత్వంలో దిశ చట్టాన్ని తెచ్చారు. మహిళలపై అత్యాచారాలు జరిగినా పట్టించుకోలేదని విమర్శించారు. 2023 జనవరి – అక్టోబర్ మధ్య 22,418 నేరాలు జరిగాయని, ఇప్పటి వరకు 14,650 కేసులు నమోదయ్యాయని అనిత చెప్పారు.
మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నామని అనిత చెప్పారు. ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహాన్ని గుర్తించడానికి సమయం పట్టిందన్నారు. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదని, పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారు.. అసలు దిశ చట్టం ఉందా.? గంజాయిపై గత ఐదేళ్లలో ఒక్క సమీక్ష అయినా చేశారా అంటూ వైసీపీ సభ్యులను ప్రశ్నించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వమే మహిళల భద్రతకు పెద్దపీట వేసిందని అనిత స్పష్టం చేశారు. జగన్ తల్లి, చెల్లికి అన్యాయం జరిగినా అండగా ఉంటామని చెప్పారు. అయితే, హోమంత్రి అనిత వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు.
అంతకుముందు.. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని వైసీపీ సభ్యురాలు వరుద కళ్యాణి మాట్లాడారు.. దిశ యాప్, చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ఘోరంగా విఫలం అయిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.