Heat Wave : మరో 2 వారాలు మంటలే.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పిన ఐఎండీ

Hot Summer : చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగొచ్చని ఐఎండీ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని భావిస్తోంది.

Hot Summer(Photo : Google)

Hot Summer : మండిపోతున్న ఎండలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. భానుడు భగభగ మండుతున్నాడు. సెగలు, పొగలు కక్కేస్తున్నాడు. మండుతున్న ఎండలతో ఏపీ, తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయా? అని ఎదురుచూస్తున్న ప్రజలకు ఇప్పట్లో ఉపశమనం లభించే అవకాశం కనిపించడం లేదు. మరో 2 వారాలు ఎండల తీవ్రత, వడగాల్పులు తగ్గే అవకాశం లేదని వాతావరణ శాఖ అంచనా వేసింది.

సాధారణంగా మే చివరి వారంలో ఎండల తీవ్ర తగ్గుతుంది. కానీ, ఈసారి జూన్ మొదటి వారం వరకు కూడా చండ ప్రచండ ఎండలు తప్పవని ఐఎండీ ప్రకటించడంతో జనంలో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీగా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగొచ్చని ఐఎండీ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని భావిస్తోంది.

High Temperatures In AP: నిప్పుల కొలిమి..! అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో 43.2, ఆదిలాబాద్ లో 41.3, భద్రాచలంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండలో 41, హైదరాబాద్ లో 39.5, మహబూబ్ నగర్ లో 40.8, మెదక్ లో 40.8, నిజామాబాద్ లో 40.9, రామగుండంలో 42 డిగ్రీల సెల్సియన్ గరిష్ణగ్రతలు నమోదవుతున్నాయి. ఇక, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Also Read..Hot Summer : బీకేర్‌ఫుల్.. మరింత మండిపోనున్న ఎండలు, రికార్డు స్థాయిలో పెరగనున్న ఉష్ణోగ్రతలు- ఐఎండీ వార్నింగ్

ఇక, భానుడు తిరుపతి నగరంపైన పగబట్టాడా? అన్నట్టుగా తిరుపతిలో ఎండలు మండిపోతున్నాయి. గ్రీష్మ తాపానికి నగరవాసులు విలవిలలాడిపోతున్నారు. గడిచిన 10 రోజులుగా 42, 43 డిగ్రీలకు తగ్గకుండా తిరుపతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మాడు పగిలే ఎండలతో తిరుమలకు వచ్చే యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మే మొదటి వారం నుంచే ఎండల తీవ్రత అధికంగా ఉంది. మూడో వారం వచ్చేసరికి ఎండతీవ్రత తారస్థాయికి చేరింది.

ఎండల తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. ఇంటికే పరిమితం కావాలంటున్నారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. గడిచిన 4 రోజులుగా ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరాయి. ఇవాళ తిరుపతిలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండదెబ్బకు నగర వీధులు బోసిపోయాయి. తిరుమల కొండపైనా ఎండలు ఠారెత్తిస్తున్నారు. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దాంతో యాత్రికులు అల్లాడిపోతున్నారు.