అనంతలో డీలాపడ్డ టీడీపీ.. బాబు రాకతో జోష్ నింపేనా?

  • Publish Date - December 18, 2019 / 11:02 AM IST

ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ పరిస్థితి అన్ని జిల్లాల్లోనూ అయోమయం.. గందరగోళంగా తయారైంది. అలాంటి జిల్లాల్లో అనంతపురం కూడా ఒకటి. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలోని నేతలు, కార్యకర్తలు అందరూ సైలెంట్ అయిపోయారు. నిరాశలో కూరుకుపోయి ఉన్నారు. ముందుండి నడిపించాల్సిన నాయకులు కూడా కనిపించకుండా పోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఉత్సాహాన్ని నింపేందుకు పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాకు వచ్చారు. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి పార్టీ కేడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేయబోతున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించబోతున్నారు.

నియోజకవర్గ ఇంఛార్జీల్లో టెన్షన్ :
చంద్రబాబు రాకతో కొన్ని నియోజకవర్గ ఇంఛార్జిలలో టెన్షన్ పట్టుకుందని అంటున్నారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం, శింగనమల నియోజకవర్గాల్లో తెలుగుతమ్ముళ్ల మధ్య విభేదాలు ముదిరిపోయాయని అంటున్నారు. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పని చేశారంటూ ఇప్పటికే అధినేతకు ఫిర్యాదు చేసిన నియోజకవర్గ ఇంఛార్జిలు తాజాగా చంద్రబాబు పర్యటనలో సైతం ఇవే వాదనలు వినిపించాలని డిసైడ్ అయ్యారట. కళ్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, ప్రస్తుత నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు వర్గాల మధ్య తీవ్ర విభేదాలున్నాయి.

మరోపక్క శింగనమల నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే యామిని బాల, ఎంఎల్సీ శమంతకమణి ఒక వైపు ఉండగా, మరోవైపు నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రావణి మధ్య అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉందట. ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పార్టీ మారిన క్రమంలో అక్కడ ఇప్పటి వరకు పార్టీ ఇంఛార్జిని నియమించలేదు. ఇక్కడ బాధ్యతలు తీసుకొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటున్నారు. మొదట్లో పరిటాల కుటుంబానికి బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, వారు కూడా ముందుకు రాకపోవడంతో ఈ విషయం బాబుకు పెద్ద తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ వైపు.. జేసీ కుటుంబం చూపు? :
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం పార్టీ వీడుబోతుందంటూ ప్రచారం జరుగతున్న నేపథ్యంలో ఆయన వర్గీయులు కూడా పెద్ద ఎత్తున పార్టీ మారే అవాకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వారి వ్యవహారంపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలంటున్నారు. ఇప్పటివరకు జేసీ దివాకర్ రెడ్డి అనేక ప్రకటనలు చేస్తూ గందరగోళంలో ఉన్నారు. ఒకవైపు సీఎం జగన్‌ను పొగిడినా ఫలితం లేకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే బీజేపీ జాతీయ నేత జేపీ నడ్డాను కలిసి రావడంతో అనుమానాలు మరీ ఎక్కువయ్యాయి. జిల్లాలో కీలక నేతలుగా ఉన్న పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, కాలవ శ్రీనివాసులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పార్థసారథి వంటి వారంతా ఎక్కడా సీరియస్‌గా స్పందించడం లేదు. మరి వీరందిరినీ చంద్రబాబు ఏ విధంగా యాక్టివ్ అయ్యేలా చేస్తారో చూడాలంటున్నారు.

జేసీతో పాటు చాలామంది ముఖ్యనేతలు పార్టీ మారుతారంటూ వార్తలు వస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఏం చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. బాబు పర్యటనకు డుమ్మా కొట్టే నేతలపై కూడా ప్రచారం సాగుతోంది. ఇన్ని సవాళ్ల నడుమ చంద్రబాబు తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందేనని జనాలు అంటున్నారు.