Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి క్యూలైన్లు వెలుపలకు వచ్చాయి. శిలాతోరణం వరకు కూడా సర్వ దర్శనం క్యూలైన్లు ఉన్నాయి. దీంతో స్వామి వారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నారాయనగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా నిండిపోయాయి. నారాయణగిరి దాటి శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉంది. ఇక్కడి నుంచి ఆక్టోపస్ భనవం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్ ఉంది.
గత రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఈ వారం రోజుల పాటు ఇదే రీతిలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. వారాంతం కావడం, వైకుంఠ ఏకాదశి కావడంతో.. భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగే అవకాశం ఉంది. దర్శనం విషయంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఎక్కువ సేపు సమయం భక్తులకు ఇచ్చే విధంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంది.
నిన్న కూడా 70వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అటు అలిపిరి వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. అలిపిరి వద్ద నిత్యం 10వేల వాహనాలు వస్తుండటంతో వాహనాల రద్దీతో అలిపిరి ప్రాంగణం కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది. క్యూలైన్ల వద్దనే అన్నప్రసాదాలు, తాగునీరు అందజేస్తున్నారు. వారం రోజుల పాటు అంటే జనవరి 1వ తేదీ వరకు ఇదే విధంగా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేశారు.
Also Read: 2026లో బంగారంపై పెట్టుబడి పెడితే మీపై డబ్బుల వర్షం కురుస్తుందా? లేదంటే వెండిపైనా..?