చావులోనూ వీడని బంధం- భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి 

husband died , due to  his wifes death : జీవితాంతం తోడు నీడగా ఉంటానని చేసిన పెళ్లి నాటి ప్రమాణాన్ని పాటిస్తూ భార్య వెంటే పయనించాడు ఒక భర్త. భార్య మరణాన్ని తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. భార్య మరణించిన కొద్దిసేపట్లోనే తనువు చాలించి భార్యతో పాటే వెళ్లిపోయాడు. ఈ విషాధ ఘటన విజయనగరం జిల్లా ఎస్ కోటలో జరిగింది.

ఎస్ కోట లోని పందిరప్పన్న కూడలిలో నివాసం ఉండే ఎల్ఐసీ డెవలప్ మెంట్ ఆఫీసర్ మనోహర్(56) భార్య సూర్య ప్రభావతి(47)కి శనివారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. భర్త మనోహర్ వెంటనే 108 సిబ్బందికి ఫోన్ చేశాడు. వారు వచ్చి చూసే సరికి అప్పటికే ఆమె మరణించినట్లు ధృవీకరించారు. మరణ వార్త విని మనోహర్ అతని కుమారుడు రామ్ శోక సముద్రంలో మునిగిపోయారు.

భార్య మరణవార్త విని మనోహర్ తీవ్రంగా కలత చెందాడు. ఈ సమాచారాన్ని బంధువులకు చెప్పటానికి ఫోన్ తీసుకుని ఇంట్లోనుంచి బయటకు వచ్చి ఉన్నట్టుండి కుప్ప కూలిపోయాడు. పరీక్షించిన వైద్యులు మనోహర్ గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు చావులోనూ ఒకరిని విడిచి ఒకరు వుండలేక కొద్ది సేపట్లోనే ఇద్దరూ కన్నుమూయటం అందరినీ కలిచివేసింది.