Toll Fee : ప్రయాణికులకు శుభవార్త… విజయవాడ హైవే మీద టోల్ ఫీజు తగ్గింపు
Toll Fee : విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త.. టోల్ ఫీజు తగ్గించారు.
hyderabad vijayawada highway rs 5 reduction in toll fees
Toll Fee : ప్రయాణికులకు ఊరట.. హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవే (ఎన్‌హెచ్-65)పై టోల్ ఫీజును స్వల్పంగా తగ్గించారు. ఈ హైవే మీద వివిధ రకాల వాహనాలకు రూ.5 చొప్పున టోల్ ఫీజు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తగ్గిన టోల్ ఫీజులు ఏప్రిల్ 1 (మంగళవారం అర్ధరాత్రి దాటాక) నుంచి అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద.. 3 యాక్సిల్ కమర్షియల్ వెహికల్స్‌కి రూ.5 చొప్పున టోల్ ఫీజు తగ్గించారు. దీంతో ఒకవైపు టోల్ ఫీజు ఇప్పటి వరకు రూ.290 ఉండగా.. ఇప్పుడది రూ.285కు తగ్గింది. 24 గంటల్లో రెండువైపులా ప్రయాణానికి గాను టోల్ ఫీజు రూ.435 నుంచి రూ.430కి తగ్గింది. అలానే కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద కూడా మూడు యాక్సిల్ కమర్షియల్ వాహనాలకు టోల్ ఫీజు రూ.5 చొప్పున తగ్గింది. ఒకవైపునకు రూ.450 నుంచి రూ.445కి… 24 గంటల్లో రెండువైపులా ప్రయాణానికి రూ.675 నుంచి రూ.670కి తగ్గింది.
అలానే ఆంధ్రప్రదేశ్ లోని చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద జీపులు, కార్లు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి రూ.105 నుంచి రూ.100కు టోల్ ఫీజు తగ్గించారు. 2 యాక్సిల్ వాహనాలకు రూ.350 నుంచి రూ.345కి తగ్గింది. అలానే 3 యాక్సిల్ వాహనాలకు 24 గంటల్లో రెండు వైపులా ప్రయాణానికి గాను రూ.570 నుంచి రూ.565కి తగ్గింది. మిగిలిన వాటి టోల్ ఫీజులు యథాతథంగా ఉన్నాయి.
