Pilli Subhash Chandra Bose
Pilli Subhash Chandra Bose : కోనసీమ వైసీపీ రాజకీయం హీట్ ఎక్కింది. రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి వేణు, ఎంపీ బోసు మధ్య పూడ్చలేని అగాథం పార్టీకి తలనొప్పిగా తయారైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి వేణుకి మళ్లీ రామచంద్రాపురం టికెట్ ఇస్తే తాను వైసీపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బోసు హెచ్చరికతో వైసీపీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
తాజాగా ఈ వ్యవహారంపై పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు పార్టీ అధిష్టానం విజయవాడ రమ్మని పిలిచి సంప్రదింపులు చేసిందని ఆయన తెలిపారు. పార్టీకి రాజీనామ చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పడం బాధకరమే అన్నారు. కానీ, అలా అనక తప్పలేదన్నారు. కార్యకర్తలపై క్రిమినల్ కేసులు పెడుతుంటే వారిలో ఆత్మస్థైర్యం పెంచడం కోసం అలా చెప్పానని వివరణ ఇచ్చారాయన.
Also Read..konaseema ycp: బోస్‌ను ఒప్పించడం త్రిమూర్తులుకు సాధ్యమా.. ఎమ్మెల్సీ ఎలా డీల్ చేస్తారో?
ఈ వేదిక ద్వారా సీఎం జగన్ కి క్షమాపణ చెబుతున్నా అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక సర్వే నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని ఎంపీ బోసు తెలిపారు. ఆ సర్వే మీద నాకు పూర్తి నమ్మకం ఉందన్నారాయన. పార్టీ నిర్మాణం లో నేను ఒక పిల్లర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి ముఖ్యమంత్రికి చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఈ పార్టీ నా పార్టీ, నా చేతులు మీదుగా నిర్మాణం చేసిన పార్టీ. రాజకీయ పార్టీకి గుమ్మాలు, ద్వారబంధాలు ఉండవు. పార్టీ మీద మాకు ఎప్పుడూ భేదాభిప్రాయాలు లేవు అని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హాట్ కామెంట్స్ చేశారు.