ఐప్యాక్.. దేశంలో పేరున్న పొలిటికల్ కన్సల్టెన్సీ టీమ్. గతంలో ఐప్యాక్ చాలా పార్టీలకు, చాలా రాష్ట్రాల్లో పని చేసింది. 2019, 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున జగన్ కోసం ఏపీలో గ్రౌండ్ వర్క్ చేసింది. ఆ ప్రాసెస్‌లో 2019లో వైసీపీ ఘనవిజయం సాధించింది. కానీ..2024లో మాత్రం ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ గెలిచినప్పుడు క్రెడిట్ ఐప్యాక్‌కు ఎంత వచ్చిందో తెలియదు కానీ..మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోనప్పుడు మాత్రం ఫ్యాన్ పార్టీ నేతలు, జగన్ అభిమానులు అంతా ఐప్యాక్ టార్గెట్‌గా విమర్శలు చేశారు.
ఐప్యాక్ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి ఎన్ని కారణాలు ఉన్నా..ఎక్కువ వేళ్లు మాత్రం పొలిటికల్ కన్సల్టెన్సీ ఐప్యాక్ వైపే చూపించాయి. కొందరు వైసీపీ నేతలు అయితే మీడియా ముందే ఐప్యాక్‌పై విమర్శలు చేశారు. ఐప్యాక్‌ను తీసుకొచ్చి తమ నెత్తిమీద పెట్టారంటూ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐప్యాక్ టీమ్ సలహాలు, సూచనల ఆధారంగానే ముందుకెళ్లాలని..ఐప్యాక్ సర్వేలో పాజిటివ్ రిపోర్ట్ రాకపోతే టికెట్ ఇవ్వబోమన్న జగన్ మాటలు కొందరు లీడర్లకు ఏ మాత్రం నచ్చలేదు. టికెట్ల మార్పునకు కూడా ఐప్యాక్ టీమే కారణమని ఇప్పటికి రగిలిపోతున్నారు నేతలు. ఈ నేపథ్యంలో జగన్ కోసం ఐప్యాక్ మళ్లీ పనిచేయబోతోందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.
వైసీపీ ఓడిపోయిన తర్వాత ఐప్యాక్ టీమ్ సైలెంట్
గత ఏడాది మే నెలలో ఎన్నికలు అయిపోయాయి. జూన్ నెలలో ఫలితాలు వచ్చాయి. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఐప్యాక్ టీమ్ సైలెంట్ అయ్యింది. కానీ లేటెస్ట్‌గా పొలిటికల్ సర్కిల్స్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఐప్యాక్ టీమ్ మళ్లీ జగన్ కోసం ఏపీలో పని చేయబోతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఓ మాజీ మంత్రి మీడియా ముందుకు వచ్చి..తమ పార్టీ ఓటమికి ఐప్యాక్ టీమ్ కారణమని ఆరోపించారు. ఆయనే కాదు..చాలామంది నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సిచ్యువేషన్‌లో ఐప్యాక్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతుందన్న టాక్..అటు వైసీపీలోనే కాదు..ఇటు ఏపీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారిందట.
ఈ నెలాఖరు లేదా..మార్చి ఫస్ట్ వీక్ నుంచి ఐప్యాక్ వైసీపీ కోసం మళ్లీ ఫుల్ ప్లెడ్జ్‌గా యాక్టివిటీ మొదలు పెట్టనుందట. అయితే ఎన్నికల ముందు పనిచేసిన మాదిరిగా కాకుండా.. కేవలం కూటమి ప్రభుత్వం వైఫల్యాలను మాత్రమే గుర్తించి.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఐప్యాక్ పనిచేయొచ్చని అంటున్నారు. గతంలో లాగా నియోజకవర్గానికి నలుగురైదుగురు టీమ్‌ను పెట్టి కాకుండా..ఉమ్మడి జిల్లాకు ఇద్దరు ప్రతినిధుల చొప్పున నియమించి..వారి ద్వారా యాక్టివిటీ నడిపించేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారట.
ఈ సారి వైసీపీకి పనిచేయబోయే ఐప్యాక్ టీమ్‌కు శశి రాజ్ ఇంచార్జ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిందట ఐప్యాక్ టీమ్. ఢిల్లీ ఎన్నికలు అయిపోగానే పూర్తిస్థాయిలో పని మొదలు పెట్టనున్నారట.
అయితే మెజార్టీ వైసీపీ నేతలు ఐప్యాక్ టీమ్‌ను వ్యతిరేకిస్తున్నప్పటికీ..జగన్ మాత్రం ఐప్యాక్ సేవలను వాడుకుని మళ్లీ అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఉన్నారట. 2019, 2024 ఎన్నికలప్పుడు ఐప్యాక్ డిజైన్ చేసిన క్యాంపెయిన్లు జగన్‌కు నచ్చినట్టు కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా.. జనం కోసం జగన్..జగన్ కోసం జనం లాంటి స్లోగన్స్..జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష..వై ఏపీ నీడ్స్ జగన్, సిద్ధం, మేమంతా సిద్ధం వంటి క్యాంపెయిన్లు డిజైన్ చేయడంలో ఐప్యాక్ కీలక పాత్ర పోషించినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఐప్యాక్ టీమ్ ద్వారా ఫీడ్ బ్యాక్?
కూటమి సర్కార్ ఇచ్చిన హామీల అమలు ఆలస్యమవుతుండటంతో పాటు, గ్రౌండ్ లెవల్‌లో కూటమి నేతల మధ్య ఉన్న గ్యాప్‌ను క్యాచ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. పార్టీని వీడిన, దూరంగా ఉంటున్న నేతల నియోజకవర్గాల్లో ఎవరిని ఇంచార్జ్‌లుగా నియమిస్తే బాగుంటుందో కూడా ఐప్యాక్ టీమ్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారట. వైసీపీ ఇంకా డ్యామేజ్ కాకుండా..కూటమి మీద వ్యతిరేకత క్రియేట్ చేసేలా ఐప్యాక్ టీమ్‌ను మళ్లీ రంగంలోకి దింపి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవాలని జగన్ భావిస్తున్నారట.
అదే సమయంలో..కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై క్యాంపెయిన్లు రన్ చేయాలంటే పొలిటికల్ కన్సల్టెన్సీ సపోర్ట్ కావాలని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2024లో ఎన్నికల పోలింగ్ ముగిశాక..వైసీపీ ఓడిపోతుందని అన్ని సర్వేలు చెప్పినా..పబ్లిక్ మూడ్ అలాగే కనిపించినా.. విజయవాడలోని ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లి టీమ్‌తో ముచ్చటించారు జగన్.
వైసీపీనే తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు 2014లో గెలుపునకు ఐప్యాక్ ఉపయోగపడలేదన్న టాక్‌ను కూడా కొట్టిపారేశారు జగన్. అంటే ఐప్యాక్ టీమ్ మీద జగన్ ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే కొంతమంది వైసీపీ నేతలు మాత్రం ఐప్యాక్ నుంచి బయటపడకపోతే కష్టమని తేల్చి చెప్తున్నారు. జగన్ నమ్మకమే తిరిగి నిలబెడుతుందా.? లేక ఐప్యాక్‌ను వ్యతిరేకిస్తున్న నేతల మాటే నిజం కాబోతుందా అనేది వేచి చూడాలి మరి.