GVL Narasimha Rao (Photo : Twitter)
GVL Narasimha Rao – CM Jagan : ఏపీలోని వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విరుచుకుపడ్డారు. పాలన చేతకాకపోతే సీఎం పీఠం నుంచి జగన్ దిగిపోవాలని జీవీఎల్ అన్నారు. విజయవాడ పాతబస్తీలో బీజేపీ బహిరంగ సభలో ఎంపీ జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. జగన్ సర్కార్ పై జీవీఎల్ ధ్వజమెత్తారు.
ఏపీలో నవరత్న పథకాలు అని జగన్ గొప్పగా చెప్పుకుంటున్నారు, వాస్తవానికి.. కేంద్రం ఇచ్చిన నిధులను ఆ పథకాలకు మళ్లించి తమ సొంతం అని ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం 38 వేల కోట్లు కేటాయించిందని జీవీఎల్ తెలిపారు. జగన్ ప్రభుత్వం మోసాలు ప్రజలకు అర్ధమయ్యాయని అన్నారు.
Also Read..GVL Narasimha Rao : రాష్ట్రంలో ప్రమాదకర స్థితిలో శాంతిభద్రతలు : ఎంపీ జీవీఎల్
”గడప గడపకు వెళ్లే సాహసం వైసీపీ ఎమ్మెల్యేలు చేయలేకపోవడం సిగ్గుచేటు. ఎన్టీర్ సినిమాలో చెప్పిన విధంగా లేదు, తెలియదు, చెప్పలేను అనేలా రాష్ట్ర రాజధాని విషయంలో పాలకులు ఉన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. పదేళ్ల పిల్లాడిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. చంపేసి మళ్లీ లక్ష రూపాయలు ఇస్తామంటారా.. సిగ్గుందా? ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? పాలన చేతకాకపోతే జగన్ సీఎం పీఠం నుంచి దిగిపోవాలి.
ప్రభుత్వం లోపాలను ప్రశ్నిస్తే పథకాలు రద్దు చేస్తామని ప్రజలను బెదిరిస్తారా? ప్రజలను హింసించేలా జగన్ పాలన ఉంది. తలాక్ అని మూడు సార్లు చెబితే ఆ బంధం పోయినట్లే. ఈ అమానవీయ అంశాన్ని మోదీ మార్చారు. అవినీతికి జగన్, అభివృద్ధికి మోదీ కేరాఫ్ అడ్రస్. గత 9ఏళ్లల్లో మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమం తెలుసుకుని బీజేపీని ఆదరించండి. కేంద్రంలో కాంగ్రెస్ హయాంలో లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. మన్మోహన్ సింగ్ ను రిమోట్ తో కంట్రోల్ చేశారు. ప్రపంచ దేశాల ముందు భారతదేశం పరువు తీశారు” అని జీవీఎల్ విరుచుకుపడ్డారు.