Transmedia Entertainment City: మొన్న రీ స్టార్ట్.. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్.. అమరావతికి భారీ ప్రాజెక్ట్.. దేశంలోనే తొలి..

25వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అమరావతిలో క్రియేటివ్ ల్యాండ్ ఏర్పాటునకు ఒప్పందం కుదిరిందన్నారు.

Transmedia Entertainment City: ఇటీవలే అమరావతి పనులు రీస్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఓ భారీ ప్రాజెక్ట్ రాజధానికి రానుంది. దీనికి సంబంధించి ఒప్పందం కుదిరింది. ముంబైలో జరుగుతున్న వేవ్స్‌ (ది వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌) 2025లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, క్రియేటివ్‌ ల్యాండ్‌ ఆసియా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఏపీకి వచ్చే సందర్శకుల కోసం థీమ్‌పార్క్‌లు, గేమింగ్‌ జోన్‌లు, గ్లోబల్‌ సినిమా కో-ప్రొడక్షన్‌ జోన్‌లు ఏర్పాటు చేయనున్నారు.

ఈ మేరకు క్రియేటివ్‌ ల్యాండ్‌ ఆసియా వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ సాజ్‌ రాజ్‌ కురుప్‌తో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ఆమ్రపాలి ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రాన్ని చలనచిత్ర, వినోద, పర్యాటక రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల్లో.. క్రియేటివ్‌ ల్యాండ్‌ ఆసియాతో భాగస్వామ్యం ఒక మైలురాయిగా నిలుస్తుందని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.

Also Read: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్టులు? ఇప్పటివరకు ఓ లెక్క… ఇప్పుడో లెక్క

అమరావతిలో క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ప్రాజెక్ట్ ఒప్పందంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ సిటీ అమరావతియేనని ఆయన తెలిపారు. 25వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అమరావతిలో క్రియేటివ్ ల్యాండ్ ఏర్పాటునకు ఒప్పందం కుదిరిందన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు క్రియేటివ్ ల్యాండ్ ఒప్పందం దోహద పడుతుందని చెప్పారు. గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్స్, కథల తయారీ, ఏఐ ఆధారిత కంటెంట్ కు కేంద్రంగా క్రియేటర్ ల్యాండ్ ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. సృజనాత్మకత, డిజిటల్ పరిశ్రమలకు క్రియేటర్ ల్యాండ్ ప్రపంచ గమ్యస్థానం అవుతుందన్నారు.