Maddur Venkateswara Swamy Temple (Image Credit To Original Source)
Maddur Venkateswara Swamy Temple: 10టీవీ కథనాలపై ఏపీ దేవాదాయశాఖ అధికార యంత్రాంగం కదిలింది. నంద్యాల జిల్లా మద్దూరులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాల చోరీపై 10టీవీ వరుస కథనాలు ప్రచారం చేసింది. ఏపీ దేవాదాయశాఖ అధికార యంత్రాంగం ఆలయంలోని ఆభరణాల చోరీపై దర్యాఫ్తు చేస్తోంది. ఇప్పటికే ఆభరణాల స్టాక్ ను పరిశీలించారు అధికారులు. అటు ఆలయ మాజీ ఈవోను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అటు ఆలయ పూజారి స్వయంగా స్వామి వారి ఆభరణాలను ఆళ్లగడ్డలో అమ్మినట్లు చెబుతున్నారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. విచారణ అనంతరం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాల చోరీ జరిగింది. వెండి ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. వెండితో తయారు చేసిన కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాలు, తొడుగుతో పాటు మరికొన్ని ఆభరణాలు మాయమయ్యాయి. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారికి ఆభరణాల అలంకరణ ఉంటుంది. నిన్న కూడా స్వామి వారికి అలంకరణ చేస్తుండగా ఆభరణాలను పరిశీలించారు. దీంతో నకిలీ ఆభరణాల బాగోతం వెలుగులోకి వచ్చింది.
స్వామి వారికి భక్తులు, దాతలు విలువైన వెండి ఆభరణాలు సమర్పించుకున్నారు. అయితే, ఇప్పుడా ఆభరణాలన్నీ చోరీ కావడం దుమారం రేపుతోంది. వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు కనిపించడం భక్తులను విస్మయానికి గురి చేసింది.
ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారికి వెండి ఆభరణాలతో అలంకరణ చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఆ తర్వాత ఆభరణాలను ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తారు. ఈసారి అలంకరణకు సిద్ధం చేస్తున్న సమయంలో అసలైన వెండి ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు ఉండటాన్ని గమనించి ఆలయ అర్చకుడు షాక్ కి గురయ్యారు. ఈ విషయాన్ని వెంటనే ఆలయ అధికారులకు తెలియజేశారు.
ప్రస్తుతం అధికారుల దర్యాఫ్తు జరుగుతోంది. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు. ఈ ఘటనతో తమ మనోభావాలను దెబ్బతిన్నాయని భక్తులు, స్థానికులు వాపోయారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: ఏపీని హడలెత్తిస్తున్న స్ర్కబ్ టైఫస్.. 22మంది మృతి.. ఈ జిల్లాల్లోనే ప్రభావం ఎక్కువ..