Ips Officer Ab Venkateswara Rao Writes A Letter To Ap Cs Adityanath Das
AB Venkateswara Rao letter to AP CS : నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. తన కేసును సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
తనకు వ్యతిరేకంగా ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారని.. దానికి సంబంధించి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని వెంకటేశ్వరరావు అన్నారు. వాటికి సంబంధించిన 9 డాక్యుమెంట్లను సీఎస్ రాసిన లేఖకు జత చేశారు. ప్రభుత్వం సీబీఐతో విచారణ చేయకుంటే కోర్టుకు వెళ్తానని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఫోర్జరీలు, దొంగ డాక్యుమెంట్లతో ప్రభుత్వాన్ని కొందరు పోలీస్ అధికారులు తప్పుదారి పట్టించిన తీరును 1994లో జరిగిన నంబి నారాయణన్ ఉదంతంతో పోల్చారు. నంబి నారాయణన్ కేసులో అప్పటి డీజీపీ, ఇంటలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్‌పై ఆరోపణలు ఉన్నాయి.
సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పటికీ ఆ కేసులో విచారణ కొనసాగుతోంది. తప్పుడు కేసు బనాయించినందుకు గానూ నంబి నారాయణన్ కు కోటి 30 లక్షల రూపాయల పరిహారాన్ని కేరళ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. తన కేసులో కూడా సీబీఐ విచారణతో పాటు, పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించాలని ఏబీ వెంకటేశ్వరరావు భావిస్తున్నారు.